కోటగిరి, జూలై 4: మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో పలువురు విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. ఎస్సీ, బీసీ వసతి గృహాలను ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఎస్సీ వసతిగృహంలో పలువురు విద్యార్థులు జ్వరంతో మంచాలపై పడుకొని ఉండడాన్ని గమనించి, ఎన్ని రోజుల నుంచి జ్వరం ఉందని వారి ఆరోగ్యంపై ఆరా తీశారు.
దవాఖానకు వెళ్లారా అని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మరుగుదొడ్లను పరిశీలించారు. దుర్వాసన వెదజల్లడంతో సిబ్బంది పనితీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. కోటగిరి సర్కార్ దవాఖానలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం.