నిజామాబాద్, అక్టోబర్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళిత, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ మొండి‘చేయి’ చూపింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడి పని చేస్తున్న ఎస్సీ, బీసీ నేతలకు అన్యాయం చేయడం హస్తం పార్టీకి రివాజుగా మారింది. టికెట్ల కేటాయింపు నుంచి మొదలుకుని నామినేటెడ్ పదవుల వరకు అన్నింట్లోనూ వెనుకబడిన వర్గాలకు అధికార పార్టీ చేయిచ్చింది. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్.. ప్రభుత్వంలోకి వచ్చాక పదవుల భర్తీలోనూ అదే ఒరవడి కొనసాగించింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లో ఒక్క దళితుడికి అవకాశం కల్పించలేదు. ఒకరిద్దరు బీసీలకు నామమాత్రపు పదవులు కట్టబెట్టి మమ అనిపించడంతో అధికార పార్టీకి చెందిన దళిత, వెనుకబడిన వర్గాల నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
కీలకమైన గ్రంథాలయ చైర్మన్ పోస్టులను కాంగ్రెస్ రెండు జిల్లాల్లో ఒకే వర్గానికి కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలను పక్కన పెట్టింది. మార్కెట్ కమిటీ పదవుల భర్తీలోనూ ఇదే తీరు కనిపించింది. దీంతో చాలా మంది పార్టీ నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు. డైరెక్టర్ పదవులకే తమను పరిమితం చేశారని వాపోతున్నారు. నిజామాబాద్లో నుడా చైర్మన్గా బీసీ నేతకు పదవిని అప్పగించారు. డైరెక్టర్ల నియామకంలో దళిత, గిరిజనులకు సమన్యాయం దక్కుతుందా.. లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు దళిత జాతికి ఒక్క పదవి వరించక పోవడంతో ఆయా వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఎస్టీ వర్గానికి చెందిన నేతల్లో ఒకరికి మాత్రమే ఐడీసీఎంఎస్ పదవిని కట్టబెట్టి మమ అనిపించారు. డీసీసీబీ వైస్ చైర్మన్ పదవి భర్తీ చేయాల్సి ఉండగా రాజకీయ సమీకరణాలతో వాయిదా వేస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఉమ్మడి జిల్లాకు ఐదు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఇందులో ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన వారు ఉండగా, ఇద్దరు బీసీలు, మైనార్టీ నేత ఒకరు ఉన్నారు. దళిత వర్గానికి చెందిన వారికి అసలు ప్రాధాన్యమే దక్కలేదు. ఇక, కీలకమైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను సైతం అగ్రవర్ణాల వారికే కాంగ్రెస్ కట్టబెట్టింది. ఆయా పోస్టులకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీసీ, దళిత వర్గాలకు చెందిన ముఖ్య నాయకులంతా పోటీ పడ్డారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారంతా హైదరాబాద్లో కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సీన్ కట్ చేస్తే రెండుచోట్ల ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు పదవులు కట్టబెట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించింది. అప్పట్లో బీసీలకే గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను కట్టబెట్టారు. కామారెడ్డి గ్రంథాలయ చైర్మన్గా ఒకసారి గౌడ సామాజికవర్గానికి, మరోసారి పద్మశాలీ వర్గానికి చెందిన నేతకు అవకాశమిచ్చారు. నిజామాబాద్లోనూ పద్మశాలీ బిడ్డకు గ్రంథాలయ సంస్థ బాధ్యతలు అప్పగించారు. మైనార్టీ కమిషన్ చైర్మన్గా తారీఖ్ అన్సారీకి, రెడ్కో చైర్మన్గా అలీకి బీఆర్ఎస్ అవకాశం కల్పించింది.
ఉర్దూ అకాడమీ చైర్మన్గా ముజీబుద్దీన్ను గౌరవించింది. బీసీ బిడ్డ బాజిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్గా, దళిత వర్గానికి చెందిన డా.మధుశేఖర్కు కీలకమైన కార్పొరేషన్ పదవిని అప్పగించింది. జిల్లాకు చెందిన దళిత మేధావి ప్రొ.లింబాద్రిని ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమించింది. మున్నూరుకాపు వర్గానికి చెందిన ఆకుల లలితను సైతం ఆదరించి ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, మహిళా కమిషన్ సభ్యురాలిగా సూదం లక్ష్మికి కేసీఆర్ అవకాశం కల్పించారు. నియామకాల్లో బీఆర్ఎస్ అందరినీ గౌరవించగా, కాంగ్రెస్లో అలాంటి సమీకరణలు కనిపించడం లేదని హస్తం నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానం జుక్కల్ను మినహాయిస్తే మిగిలిన చోట్ల కాంగ్రెస్ సామాజిక సమతూకం పాటించలేదు. మైనార్టీ నేత షబ్బీర్ అలీని ఆయన సొంత నియోజకవర్గమైన కామారెడ్డి టికెట్ ఇవ్వలేదు. అప్పటికప్పుడు అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడంతో ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. మిగిలిన ఏడు చోట్లా కాంగ్రెస్ అగ్రవర్ణాలకే అవకాశమిచ్చింది.
బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన అగ్రవర్ణ నేతలకు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతల ఆశలపై నీళ్లు చల్లింది. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లోనూ అగ్రవర్ణాలకే పెద్దపీట వేశారు. చివరకు లోక్సభ ఎన్నికల్లోనూ నిజామాబాద్లో రెడ్డి సామాజివర్గానికే అవకాశమిచ్చింది. అయితే బీఆర్ఎస్ మాత్రం నిజామాబాద్, జహీరాబాద్ నుంచి బీసీ నేతలను పోటీలో నిలబెట్టి వెనుకబడిన వర్గాలను ఆదరించింది. అదే సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి పదవుల పంపకం దాకా కాంగ్రెస్ వివక్ష చూపిస్తుండడంతో ఎస్సీ, బీసీ నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది.