నిజామాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెస్తానన్న పసుపు బోర్డు రాలేదు కానీ నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌కు మాత్రం సుగంధ ద్రవ్యాల బోర్డులో సభ్యుడిగా పదవి మాత్రం వరించింది. ఏపీకి చెందిన బాలశౌరితోపాటు నిజామాబాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ సైతం బోర్డు మెంబర్‌గా ఎన్నికైనట్లు పార్లమెంట్ బులెటిన్ రిలీజ్ అయ్యింది. తనను ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని మోసం చేసిన అర్వింద్ పూటకో విధంగా వ్యవహరిస్తూ రైతులను వంచిస్తున్నాడు. మూడున్నరేండ్లుగా పసుపు బోర్డు ఏర్పాటుపై పల్లెత్తు మాటెత్తని ఈ లోక్‌సభ సభ్యుడు నిరంతరం అవాకు లు, చవాకులతో పబ్బం గడుపుతున్నాడు. 2020లో స్పైసెస్ బోర్డు ద్వారా ఎక్స్టెన్షన్ కార్యాలయా న్ని ఏర్పాటు చేయించడంతో తన పని పూర్తయ్యిందన్న ట్లుగా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తుండడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడేకంగా వద్దంటోన్న స్పైసెస్ బోర్డులోనే మెంబర్‌గా పదవిని దక్కించుకున్నాడే తప్ప పసుపు బోర్డును మాత్రం పట్టించుకోకపోవడం ఏంటంటూ రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ ఎంపీ తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సెటైర్లు…
నోరు తెరిస్తే పచ్చి బూతులు వల్లించే ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సుగంధ ద్రవ్యాల బోర్డులో మెంబర్‌గా పదవి వరించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వెలువడుతున్నాయి. బూతులు తిట్టే వ్యక్తితో సుగంధ పరిమళాలతో గుప్పుమనాల్సిన బోర్డుకు భరించలేని దుర్ఘంధం అంటుకుందంటూ విసుర్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఎంపీ అర్వింద్ తీరు మార్చుకో లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చెయ్ అంటూ సవాళ్లు సైతం నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన నెటిజన్ల నుంచి వినిపిస్తుండడం కనిపించింది. తనకు పదవి వచ్చిందంటూ బీజేపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ఎంపీ అర్వింద్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం ద్వారా రైతులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు పేరుతో ఎంపీగా గెలుపొందిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాల బోర్డులో ఏం పని? అంటూ ప్రశ్నిస్తున్నారు. 2020లో ఏర్పాటైన సుగంధ ద్రవ్యాల బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం ద్వారా జరిగిన లాభం అంటూ ఏమైనా ఉందా? అంటూ నిజామాబాద్ వాసు లు అడుగుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్టాగ్రామ్లతో పాటు వాట్సాప్‌లో గంపగుత్తగా పోస్టులు వచ్చి పడుతుండడంతో ఎంపీవర్గీయులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.
అదే అసత్య ప్రచారం…
ఎంపీ అర్వింద్ అసత్య ప్రచారాన్ని వీడడం లేదు. స్పైసెస్ బోర్డులో మెంబర్‌గా ఎన్నికైనట్లు విడుదల చేసిన ప్రకటనలో నిజామాబాద్, జగిత్యాల పరిధిలోని పసుపు రైతులకు ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. 1986 నుంచి 2020 వరకు రానటువంటి బడ్జెట్‌ను 2022-2025 కాలానికి రూ.30కోట్లు ఆమోదింపజేసినట్లుగా వెల్లడించారు. ఇందులో నుంచి ఇప్పటికే రూ.9కోట్లు విడుదలైనట్లు ప్రకటించారు. ఇదంతా గొప్పలు చెప్పడానికే తప్ప క్షేత్ర స్థాయిలో రైతులు ఒనగూరిన లాభం చూపించాలంటూ రైతులు అడుగుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా పసుపు పంట పెద్ద ఎత్తున సాగైంది. 9 నెలల కాలానికి సాగయ్యే పసుపును చాలా మంది రైతులు ఇదే జీవనాధారంగా సాగు చేసి లబ్ధి పొందారు. దాదాపు 40 వేల ఎకరాల్లో విస్తరించిన పసుపు పంట ఇప్పుడేకంగా 30 వేలకు పడిపోతున్నది. స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్ ద్వారా రూ.కోట్లు ఖర్చు చేసినట్లు అయితే సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గుతుందో ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెగుళ్లతో దిగుబడి వస్తుందో? రాదో? అన్న మీమాంసలో పసుపు రైతులు కొట్టుమిట్టాడుతుంటే అసత్యాలతో ప్రజలకు వాస్తవ దూర విషయాలతో మభ్య పెట్టడం తగదంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
మిర్చీ పంటకు మేలు చేస్తా…
నవ్వి పోదురు గాక నాకేంటి అన్నట్లుగా మారింది ఎంపీ ధర్మపురి అర్వింద్ పరిస్థితి. 2019 ఎన్నికల సమయంలో పసుపు, ఎర్రజొన్న పంటలకు కనీస మద్దతు ధరతో పాటు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానంటూ ఏకంగా బాండ్ పేపర్ రాసిచ్చాడు. తీరా ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎంపీగా చేసిందేమీ లేదు. పసుపు పంటను పట్టించుకున్న దాఖలాలే లేవు. క్షేత్ర స్థాయిలో అడుగు పెట్టి రైతులతో మాట్లాడింది లేదు. సాగు వివరాలను కానీ, దిగుబడులపై ఆసక్తితో రైతులను ముచ్చటించింది అంతకన్నా శూన్యం. పసుపు పంటకే దిక్కులేని దుస్థితి ఉండగా తాజాగా మిర్చీ పంటకు సైతం న్యాయం చేస్తానంటూ అర్వింద్ మాటెత్తడం వీస్తూగొల్పుతోంది. స్పైసెస్ బోర్డు మెంబర్‌గా పసుపు, మిర్చీ పంట రైతుల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడతానంటూ ప్రకటించడంపై రైతుల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నది. ఇదిలా ఉండగా స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం అన్నది కొత్తగా ఏమీమంజూరైంది కాదు. ఎంపీగా కవిత ఉన్నప్పుడే 2017లో మంజూరైతే తిరస్కరించారు. పసుపు బోర్డే కావాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తే ఎంపీ అర్వింద్ మాత్రం కేంద్రంతో కొట్లాడలేక మౌనం వ హించి ఎక్స్టెన్షన్ సెంటర్‌కు మొగ్గు చూపడం విశేషం.