బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్. నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు. బంజారాల ఆలోచన, వారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడు సేవాలాల్ మహరాజ్. సాంఘిక సమానత్వం కావాలంటూ, బంజారాలు ఆర్థికంగా బలపడాలంటూ పలు బోధనలు చేశారు. నేడు (గురువారం) సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని గడ్డమాంగలూరు గ్రామానికి చెందిన రామావత్ భీమానాయక్, ధర్మిణి దంపతులు. మొదటి బిడ్డగా సంత్ సేవాలాల్ మహరాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి బళ్లారిలోని గుత్తి రాంజీనాయక్ తండాలో జన్మించాడు. సేవాలాల్ చిన్నతనం నుంచి భక్తి భవాలు కలిగిన మహనీయుడు. గిరిజనులను ఏకం చేసేందుకు, జాతి సన్మార్గంలో పయనించేలా సేవాలాల్ మహరాజ్ దేశమంతా తిరిగి ఆధ్యాత్మిక ప్రచారం నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్ మహిమలను నవాబ్ ఉస్మాన్ పాషా నమ్మి హైదరాబాద్ శివారులోని కొంత ప్రాంతాన్ని ఇచ్చాడని, అదే నేటి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అని పలువురు చెబుతున్నారు. అలా బోధనలు చేస్తూ సేవాలాల్ మహరాజ్ మహారాష్ట్రలోని రాయగాడ్ జిల్లాలో సమాధి అయ్యారు. సేవాలాల్ మహరాజ్ సమాధి అయిన రాయగాడ్ బంజారాల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఈ ప్రాంతాన్ని పౌరఘడ్, సేవాఘడ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ప్రతి తండాలో తప్పనిసరిగా సేవాలాల్ మహరాజ్ మందిరాన్ని నిర్మించుకొని ఆ మహనీయుడు చూపిన మార్గంలో గిరిజనులు పయనిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో సుమారు 375వరకు తండాలు ఉన్నాయి. 3లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరంతా సేవాలాల్ మహరాజ్‌ను పూజిస్తారు. పండుగ రోజున జెండాలను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భోగ్‌భండార్ (సిరా అన్నదానం) చేస్తారు. సేవాలాల్ మహరాజ్ జయంతి రోజు తండాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. సేవాలాల్ మహరాజ్‌ను స్మరించుకొని మాలధారణ చేస్తారు. బంజారాలను ఐకమత్యం చేసేందుకు, వ్యసనాలకు దూరంగా ఉండేందుకు కులపెద్దలు మాలధారణను ప్రోత్సహిస్తున్నారు. ఆలయాల వద్ద ఉంటూ దీక్షలను నియమ నిష్ఠలతో కొనసాగిస్తున్నారు.ఈ మాలధారణ శివరాత్రికి ప్రారంభమై శ్రీరామనవమికి పూర్తవుతుంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు. సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక సాధారణ సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు జరిగే 285వ జయంతి కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రూ.లక్షా 80వేలు మంజూరు చేసింది.
సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతిని సాధారణ సెలవుదినంగా కాకుండా పూర్తిగా సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం పా ఠ్యాంశాల్లో సేవాలాల్ మహరాజ్ చరిత్రను చేర్చాలి. ఆలయాల నిర్మాణానికి నిధులను కేటాయించాలి. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలి. పూజారులకు గౌరవభృతి అందించాలి.
గిరిజన జాతికి సంత్ సేవాలాల్ మహరాజ్ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. జయంతి రోజున ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలి. సమైక్య రాష్ట్రంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బంజారాల మనోభావాలను గుర్తించి అధికారికంగా నిర్వహించడం సంతోషకరం.