సప్తవర్ణ రంగులతో మెరిసి పోయిన వాకిళ్లు.. పిల్లాపెద్దలతో సందడిగా మారిన లోగిళ్లు.. ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ముత్యాల ముగ్గులతో నేలమ్మ సరికొత్త సొబగులు అద్దుకోగా, రంగురంగుల పతంగులతో నీలాకాశం నిండిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వీధులన్నీ మగువలతో కిటకిటలాడాయి. ఇంటి ముందరి వాకిళ్లు ముగ్గులు, గొబ్బెమ్మలతో నిండి పోయాయి. పిల్లలు, పెద్దలు పోటీ పడి పతంగులు ఎగురవేశారు. మహిళలు నోములు నోచుకుని సుభాషిణులకు పంచిపెట్టారు. రైతులు తమ పంటపొలాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 16 : వాకిళ్లలో రంగవల్లులు, ఆకాశంలో పంతంగులతో నింగి, నేల రంగులమయం అయ్యాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ.. మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి సంబురాలను ఉమ్మడి జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. మహిళలు రంగవల్లులతో లోగిళ్లను శోభాయమానంగా మార్చి.. గొబ్బెమ్మలు, రేగుపండ్లు పెట్టి పూజించారు. చుట్టు పక్కలవారికి నోములను పంచిపెట్టారు. చిన్నారులను భోగి పండ్లతో దీవించారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు అలరించాయి. పిల్లలు, యువత పతంగులను ఎగురవేసి సంబురాలు జరుపుకొన్నారు. రంగురంగుల పతంగులతో ఆకాశం ఇంద్రధనస్సును తలపించింది.
రైతన్నలు పొలాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. పంటలను కాపాడాలని, సిరి సంపదలను ప్రసాదించాలని వేడుకుంటూ పంచపాడవులు, లక్ష్మీదేవికి నైవేద్యాలు సమర్పించారు. పండుగవేళ పతంగులు, మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. సంబురాల్లో ఉమ్మడి జిల్లా ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సురేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. బోధన్‌లో స్థానిక యువకులతో కలిసి ఎమ్మెల్యే షకీల్ పతంగులను ఎగురవేశారు.