డిచ్పల్లి, మే 21: తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్స్‌లర్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. సుమారు ఏడాది కాలంగా ఇన్చార్జ్జీలతోనే నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి వీసీ పోస్టుకోసం 159మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 133మంది ప్రస్తుతం సెర్చ్‌కమిటీ ఎంపిక చేసే జాబితాలో ఉన్నారు. దాదాపు ఈ నెలాఖరులోగా వీసీ ఎంపిక పూర్తయ్యే అవకాశమున్నది.
విశ్వవిద్యాలయానికి చెందిన ఏడుగురు ప్రొఫెసర్లు వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్ కనకయ్య, విద్యావర్ధిని, నసీం, ప్రస్తుత సీవోఈ ప్రొఫెసర్ అరుణ, కైసర్ మహ్మద్ తదితరులు ఉన్నారు. వీరే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యారంగానికి చెందిన ప్రొఫెసర్ ప్రసాద్‌తోపాటు మరో ప్రొఫెసర్ కృష్ణారావు కూడా ఉన్నట్లు తెలిసింది. వీరిలో ప్రొఫెసర్ ప్రసాద్ వేల్పూర్‌కు చెందిన వాస్తవ్యుడు కావడంతో ఆయనకు అవకాశమున్నట్లు వినికిడి. కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా మరో ముగ్గురు ప్రొఫెసర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు వీసీల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలిస్తున్నది. ముగ్గురు సభ్యులతో కూడిన తుది జాబితా కోసం వడపోస్తున్నారు. ఈ అంకం దాదాపు చివరి దశలో ఉన్నది. అనంతరం ముగ్గురు సభ్యులతో కూడిన జాబితాను గవర్నర్‌కు కమిటీ పంపనున్నది. వీరిలో నుంచి ఫైనల్‌గా ఒకరిని ఎంపిక చేయనున్నారు. ఎన్నికల కోడ్ కొనసాగుతుండడంతో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యం కానున్నది. మొదట అనుకున్నట్లుగా ఈనెల 27లోగా వీసీల ఎంపిక ప్రక్రియను మొత్తం పూర్తి చేయనున్నట్లు తెలిసింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే నెల 6న ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయనున్నది. 7న రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు పూర్తిస్థాయి వీసీలను ప్రకటించనున్నట్లు తెలిసింది.
తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జీ వీసీగా సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియాను ప్రభుత్వం మంగళవారం నియమించింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్న సందీప్‌కుమార్‌ను టీయూ వీసీ బాధ్యతలు అప్పగించింది. రెగ్యులర్ వీసీ వచ్చే వరకు ఇన్‌చార్జీగా కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా సందీప్‌కుమార్ సుల్తానియా గతంలో జిల్లాలో నీరు-మీరు పీడీగా పనిచేశారు.