బోధన్, జూలై 1: మంజీర తీరంలో ఇసుక తోడేళ్లు విజృంభిస్తున్నాయి. అనుమతుల్లేకుండా నదీగర్భంలోని ఇసుకను తోడెస్తున్నాయి. ట్రాక్టర్లలోనే కాదు, ట్రాలీ ఆటోలు, బొలెరే వంటి వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో బోధన్ డివిజన్లోని పెద్ద క్వారీలు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇసుక మాఫియా మరో రూపంలో తమ అక్రమ దందాను నడిపిస్తున్నది. అక్రమ మార్గాల్లో ఇసుక రవాణా చేసేందుకు మంజీర నదిలో పగలనక, రాత్రనక ఇష్టమొచ్చిన రీతిలో ఇసుక కోసం తవ్వకాలు జరుగుతున్నాయి.
నిత్యం ట్రాక్టర్లలో ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ, అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. పొతంగల్, సాలూర, బోధన్, రెంజల్ మండలాల పరిధిలోని మంజీర తీరంలో ఇసుక దోపిడీ యథేచ్చగా సాగుతున్నప్పటికీ.. అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు. ట్రాక్టర్లలోనే కాకుండా ట్రాలీ ఆటోలు, బొలేరో ట్రాలీ వాహనాల్లో కూడా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతుండడం గమనార్హం. ట్రాలీల్లో ఇసుక కనబడకుండా ఉండేందుకు టార్పలిన్లు కప్పి ఇసుకను తీసుకెళ్తున్నారు.
మరోపక్క కొందరు ఇందిరమ్మ ఇండ్ల అనుమతుల పేరిట ఇసుకను తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారనే విమర్మలు వెల్లువెత్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల కోసమని అనుమతులకు తీసుకుని ఒకే పర్మిట్‌పై పదేపదే ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల కోసం రవాణా జరిగే ఇసుక ట్రాక్టర్లకు ‘ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక’ అన్న బ్యానర్‌ను ఆ వాహనాలకు కట్టాలన్న నిబంధన ఉంది.
ఈ నిబంధనను ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో ఏ వాహనం ఇందిరమ్మ ఇండ్ల కోసమో, ఏ వాహనం కమర్షియల్ అవసరాల కోసమో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇసుకను అక్రమ మార్గంలో తీసుకెళ్లి ఒక ట్రాక్టర్ ట్రాలీ ఇసుకను రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇసుక ఆక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం ‘మన ఊరు -మన ఇసుక’ విధానం అమలులో విఫలమయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇసుక అవసరమైనవారికి సరసమైన ధరకు ఇసుక లభించకపోవడం, బ్లాక్ మార్కెట్లో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పట్టించుకోని రవాణా శాఖ
వ్యవసాయ అవసరాల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ఇసుక అక్రమ రవాణా కోసం ఉపయోగిస్తున్నప్పటికీ రవాణాశాఖ పట్టించుకోవటం లేదు. దీంతో ఇసుక వ్యాపారం కోసమే ట్రాక్టర్లను కొనుగోలు చేయటం మంజీర తీరప్రాంత గ్రామాల్లో ఎక్కువగా జరుగుతున్నది. వ్యవసాయ అవసరాల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్లను కమర్షియల్ ప్రయోజనాల కోసం వినియోగిస్తే కేసులు పెడతామంటూ రెండేండ్ల కిందట హడావుడి చేసిన రవాణాశాఖ అధికారులు ఇప్పుడు కిమ్మనడం లేదు.
మంజీర తీరంలోని గ్రామాల్లో వ్యవసాయ అవసరాలకు మించి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ఉండటం చూస్తుంటే.. ఇసుక అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల వెనుక ఉండే ట్రాలీలకు నంబర్ ప్లేట్లు ఉండాలి. అయితే, అనేక ట్రాలీలకు నంబర్ ప్లేట్లు ఉండటం లేదు. ఇలా, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇసుక అక్రమ దందాను అరికట్టాల్సిన అవసరం ఉన్నదని స్థానికులు కోరుతున్నారు.
ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
బిచ్కుంద, జూలై 1: అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. మండలంలోని గుండె నెమ్లి గ్రామ శివారులోని మంజీర పరీవాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా, బండా రెంజల్ గ్రామస్తులు బుధవారం రాత్రి అడ్డగించారు. వే బిల్లులు లేవని తేలడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై రెవెన్యూ అధికారుల వివరణ కోరగా, అది మైన్స్‌కు సంబంధించినదని, ప్రభుత్వ అనుమతితోనే క్వారీ కొనసాగుతున్నదని సమాధానమిచ్చారు.
అయితే, అనుమతులు ఉంటే రాత్రి వేళ ఇసుక తవ్వడంతో పాటు తరలించాల్సిన అవసరం ఏముందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బండారెంజల్ శివారులోని మంజీరలో ఇసుక తవ్వకాలు నిలిపి వేయాలని గ్రామస్తులు గతంలో ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినప్పటికీ కొందరు అక్రమార్కులు ప్రభుత్వ అనుమతుల పేరిట రాత్రివేళ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు, బండా రెంజల్ గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నది నిజమేనని పోలీసులు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తెలిపారు.