ఉమ్మడి జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులు నదులు, వాగులు, వంకలను తోడేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అక్రమార్కులు పట్ట పగలు ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక కోసం ఇబ్బందులు పడుతుంటే.. ఇసుకాసురులు అనుమతుల పేరిట అడ్డూ అదుపులేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారు.
-బిచ్కుంద, జూలై 11
బిచ్కుంద మండలంలోని హస్గుల్, పుల్కల్, ఖత్గావ్ గ్రామాల మంజీర పరీవాహక ప్రాంతం నుంచి ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా తరలించడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి పది ట్రాక్టర్ల ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం అనుమతి ఇవ్వగా..వాహన ఖర్చులను మాత్రం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. దీంతో ఒక ట్రాక్టర్కు అనుమతి ఉండగా మూడు నుంచి నాలుగు వాహనాల్లో ఒకే వేబిల్తో ఉదయం నుంచి రాత్రివరకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
జుక్కల్ నియోజక వర్గంలో ఒక మండలం పేరుతో అనుమతి పొంది ఇంకో మండలానికి ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల నియోజక వర్గంలోని పెద్ద కొడప్గల్ మండలానికి ఇసుక తరలింపునకు అనుమతి పొంది బిచ్కుం ద మండల కేంద్రంలో ఖాళీ చేశారు. అనుమతులు రాకముందే ఇసుక ట్రాక్టర్లు లోడ్ చేసుకొని అనుమతుల కోసం వేచి చూడడం గమనార్హం. రెవెన్యూ అధికారులు మంజీర పరిసర గ్రామాలకు వచ్చి అనుమతులు జా రీ చేసేలోగా నాలుగు నుంచి ఐదు ట్రిప్పులను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందని ద్రాక్షగా మారుతున్నది. ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అతివేగంగా తీసుకెళ్తూ మిగతా వాహనదారులు, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల పేరిట ఇసుక రవాణా చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టునట్లుగా వ్యవరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అసలైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రాత్రివేళ ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకున్నా మంజీరా లో యథేచ్ఛగా తవ్వకాలచేపట్టి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు ఇసుక వాహనాలు తరలివెళ్తున్నాయి. తరలించిన ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు, ఇతర పనుల కోసం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రాత్రివేళ ఇసుక వాహనాలు వెళ్లడంతో వాహనాల శబ్దానికి నిద్ర పట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
లబ్ధిదారులు మాట్లాడుకున్న ట్రాక్టర్కు మాత్రమే అనుమతులు ఇస్తాం. మంజీర వద్ద వేబిల్లు సంబంధిత ట్రాక్టరుకు ఇవ్వడం మా బాధ్యత, అక్కడి నుంచి ఇసుకను తరలించుకునే బాధ్యత లబ్ధిదారుడిదే. అనుమతులు పొంది లబ్ధిదారుడి ఇంటికి తరలించకుండా ఇతర చోటికి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇసుక రాలేదని ఫిర్యాదు చేస్తే ట్రాక్టర్ను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
-వేణుగోపాల్, బిచ్కుంద, తహసీల్దార్