బిచ్కుంద, మే 1: జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. మండలంలోని హస్గుల్, పుల్కల్, ఖత్గాం గ్రామాల శివారులోని మంజీర పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పేరిట అనుమతులు తీసుకుంటూ ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రైవేట్‌గా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. జుక్కల్ నియోజక వర్గంలోని బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్ద కొడప్గల్, పిట్లం, డోంగ్లి, నిజాంసాగర్ మండలాల్లో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల కోసం వారంలో మూడురోజులు పుల్కల్ మంజీర నుంచి ఇసుకను తరలించడానికి తహసీల్ ఆఫీస్ నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇసుక తవ్వకాలు చేపట్ట వచ్చు. వేబిల్లును ఒక ట్రిప్పుకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కానీ ఒకే వేబిల్లుపై అనేక ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు.
పుల్కల్, హస్గుల్ మంజీర నుంచి ఉదయం డంపు చేసి, రాత్రివేళ టిప్పర్ల ద్వారా హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. గత శనివారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమతులు లేకుండా తరలిస్తున్న పది ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలిస్టేషన్‌కు తరలించారు. పట్టించుకోని అధికారులు ఫిర్యాదులు అందిన సందర్భాల్లో తప్ప, మిగితా సమయాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయల్లో గండి పడుతున్నది. దీనిపై రెవెన్యూ, మైనింగ్, పోలీసుశాఖల నిఘా కరువైంది. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను మండలవాసులు కోరుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. జుక్కల్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల కోసం మండలంలోని పుల్కల్ మంజీర నుంచి మంగళ, గురు, శనివారాల్లో అనుమతులు ఇస్తున్నాం. ప్రైవేటుగా ఎవరికైనా ఇసుక అవసరం ఉంటే డీడీ తీసి అనుమతులు పొందవచ్చు. ప్రజల్లో అవగాహన కల్పించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి.
-వేణుగోపాల్, తహసీల్దార్