నిజాంసాగర్, నవంబర్ 22: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చింది. ప్రాజెక్టు గేట్లను సుమారు మూడు నెలలపాటు ఎత్తి నీటిని దిగువన మంజీరాలోకి విడుదల చేశారు. దీంతో మంజీరాలో భారీగా ఇసుక మేటలు వేశాయి. నిజాంసాగర్ మండలంలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో భారీగా ఇసుక పేరుకుపోయింది. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు అక్రమార్కులు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక అక్రమ దందాకు తెరలేపారు.
మంజీరా పరీవాహక ప్రాంతం నుంచి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి పేరిట ఒక్కో ట్రాక్టర్ రెండు ట్రిప్పుల చొప్పున వందల సంఖ్యలో ట్రాక్టర్లు నిజాంసాగర్, మహ్మద్‌నగర్, పిట్లం మండలాలకు ఇసుక రవాణా చేస్తున్నాయి. కాగా.. రాత్రి సమయంలో ఎలాంటి అనుమతి లేకుండానే ఇసుకను తోడేస్తున్నారు. దానిని సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతా లతోపాటు నిజాంసాగర్ మండలంలోని మర్పల్లి, అచ్చంపేట, బ్రాహ్మణపల్లి, ఆరేపల్లి ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. రాత్రి సమయంలోనే లారీలు, ఇతర వాహనాల ద్వారా పక్క జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
నిజాంసాగర్ మండలంలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో భారీగా ఇసుక మేటలు పేరుకుపోవడంతో నిజాంసాగర్, మహ్మద్‌నగర్, పిట్లం మండలాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుకను సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాలకు మాత్రం ఒక్కో ఇసుక ట్రాక్టర్ రూ.2500కు అందించాలని వారం రోజుల క్రితం మండలానికి వచ్చిన ఆయన స్థానిక అధికారులకు సూచించారు. కానీ నిబంధనలకు నీళ్లొదిలి రూ.3000 నుంచి రూ.4000 వరకు ఒక్కో ట్రాక్టర్ ఇసుకను సరఫరా చేస్తున్నారు. అధికారులు మాత్రం కచ్చితంగా తాము నిర్ణయించిన ధరకు అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా అమలు మాత్రం కావడం లేదు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం తమకు భారంగా మారుతున్నదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను అందించాలంటూ లబ్ధిదారులు కోరుతున్నారు.
ఎన్నడూ లేని విధంగా తమ మండలంలోనే ఇసుక మేటలు పేరుకుపోవడంతో తక్కువ ధరకు ఇసుక లభిస్తుందని నిజాంసాగర్ ప్రజలు ఆశపట్టారు. కానీ ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు మాత్రం ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా తమ ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా చేయడం తగదని మండల ప్రజలు అంటున్నారు. శనివారం అచ్చంపేట పరిధిలోని మంజీరా శివారులో ఇసుక నింపేందుకు ట్రాక్టర్లు వెళ్లగా.. ఇసుక నింపే కూలీలకు తక్కువ ధర ఇస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగారు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్లే ఇసుకను నింపి అక్కడి నుంచి తరలించారు.