మాచారెడ్డి, ఫిబ్రవరి 27 : ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. ఇసుక దందాను అరికట్టడానికి అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఇసుకాసురుల్లో ఇసుమంతైనా మార్పురావడంలేదు. అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, పాల్వంచ మండలాలు ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి.
పాల్వంచ వాగు పరీవాహక గ్రామాలైన అరెపల్లి, భవానీపేట, పాల్వంచ, వాడి, ఫరీద్పేట, బండరామేశ్వర్పల్లి, మంథనిదేవునిపల్లి, ఇసాయిపేట,లక్ష్మీరావులపల్లి, లచ్చాపేట , చుక్కాపూర్ గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారుల అండదండలతో ఇసుక మాఫియా టిప్పర్, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నది. వాగు పరీవాహక ప్రాంతం పాల్వంచ, మాచారెడ్డి రెండు మండలాల్లో ఉన్నది. ఆయా గ్రామాల్లో ఇసుకాసురులు ముఠాగా ఏర్పడి రాత్రివేళ పొక్లెయిన్ల సాయంతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. టిప్పర్లలో లోడ్ చేసి యధేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు.
తూతూ మంత్రంగా తనిఖీలు
ఉమ్మడి మాచారెడ్డి మండలం నుంచి రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇంతజరుగుతున్నా పోలీసు అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ..నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్నా పోలీసులు కనీసం ట్రాక్టర్లు, వే బిల్లులు లేని టిప్పర్లను ఆపిన దాఖలాలు లేవు. అధికారుల అండదండలతోనే ఇసుకాసురులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇసుక డంపులకు వేలం నిర్వహించాలి
మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట గ్రామశివారులో ఇసుక డంపులను ఈనెల 21 న రెవెన్యూ అధికారులు సీజ్ చేసి, ఈ నెల 24న వేలం నిర్వహించారు. అదే విధంగా వాగు పరీవాహక ప్రాంతంలోని గ్రామాల్లో అక్రమంగా ఇసుక డంపులు చేశారని, వాటిని కూడా సీజ్ చేసి వేలం నిర్వహించాలని మండల వాసులు కోరుతున్నారు.
ఇసుక రవాణాకు అనుమతిలేదు..
మండలంలో ఇసుక రవాణాకు పర్మిషన్ లేదు. కేవలం ప్రభుత్వ పనులకు మాత్రమే అనుమతి ఉన్నది. ఇసుక అక్రమంగా డంపు చేస్తే సీజ్ చేస్తాం. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలి.
– శ్వేత, తహసీల్దార్, మాచారెడ్డి