బాన్సువాడ, మార్చి 11 : రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆల్ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామ్రావ్ మహరాజ్ విగ్రహాన్ని స్పీకర్ శనివారం ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భోగ్ భండార్ కార్యక్రమంలో గిరిజనులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పా టు చేసిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదని, మన రాష్ట్రంలోనే వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. గిరిజనులు కష్ట జీవులని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోడు భూముల సమస్యలను పరిష్కరించిన మహానేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గంలోనే అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. మొత్తం 11 వేల ఇండ్లలో 2500 గిరిజన కుటుంబాలకు మంజూరుచేసినట్లు తెలిపారు. తండాల్లో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు అందజేస్తున్నట్లు చెప్పారు.
సమాజం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తుల్లో రామ్రావ్ మహరాజ్ ఒకరని పేర్కొన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని, గొప్ప భక్తిభావంతో కూడిన శక్తి అని పేర్కొన్నారు. గిరిజనులను భక్తిమార్గంలో నడిపించారని తెలిపారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే ఆవకాశం రావడం తన అదృష్టమన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో సుమారు 80 జగదాంబమాత, సేవాలాల్ మందిరాలకు రూ. 5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు.
సభలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. రామారెడ్డి మండలానికి చెందిన కళ్లు లేని చిన్నారి వికాస్ పాడిన లంబాడి పాట.. సభా ప్రాంగణం చప్పట్ల మోత మోగించింది, కళ్లు లేవని ప్రభుత్వం తరఫున సాయం అందించాలని స్పీకర్ ను కోరగా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వెంటనే రూ.ఐదు వేలు అందజేశారు. కార్యక్రమంలో ఆల్ఇండియా బంజారా సేవాసంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రానాయక్, పౌరాపీఠాధిపతి బాబాసింగ్ మహరాజ్, జిత్తు మహరాజ్, పాండురంగ నాయక్, మోహన్ నాయక్, ప్రతాప్ సింగ్ రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్ , జడ్పీటీసీ హరిదాస్, ఎంపీపీ పాల్త్య విఠల్, ప్రతాప్ సింగ్, డాక్టర్ మోతీలాల్ జాదవ్, బాన్సువాడ మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడు రాము రాథో డ్, నరేశ్ రాథోడ్, జగన్నాథ మాస్టర్ (కర్ణాటక), గోప్యానాయక్, అంబర్ సింగ్, ధన్వాల్, లోక్యా నాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాత బాలకృష్ణ, గోపాల్ రెడ్డి, అంబర్ సింగ్, బలరాం సింగ్ , తదితరులు ఉన్నారు.