చందూర్/ వర్ని, సెప్టెంబర్ 29: కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట అవినీతికి పాల్పడిన నాయకులు స్వరాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆయన వర్ని, చందూర్, వర్ని మండలాల్లో పర్యటించారు. చందూర్ మండల కేంద్రంతోపాటు కారేగాంలో రూ.1.33 కోట్లు, మోస్రాలో రూ.8 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వర్ని మండలంలో రూ.2.20 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కారేగాంలో బంజారాలతో కలిసి నృత్యం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో స్పీకర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన రోడ్లకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించారని తెలిపారు. దీంతో రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయన్నారు. కారేగాం గ్రామంలో రూ.5.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. చందూర్ నుంచి జలాల్పూర్ వరకు రూ.14కోట్ల నిధులతో రోడ్డు వేయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తోందన్నారు. నియోజకవర్గంలో ఇండ్లులేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లను మంజూరుచేస్తామని భరోసా ఇచ్చారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న వేల ఎకరాలకు రెండు పంటలకు పుష్కలంగా నీరు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పేదలకు వైద్య సేవలు అందుబాటులో తెచ్చేందుకు పల్లె దవాఖానలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ మూడ్ కవితా అంబర్‌సింగ్, ఎంపీపీ లావణ్య, సర్పంచులు సాయిరెడ్డి, బొడ్డొల్ల సత్యనారాయణ, దేవీసింగ్, రవి, విండో చైర్మన్ ప్యారం అశోక్ తదితరులు పాల్గొన్నారు.