బాన్సువాడ, మార్చి 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గృహలక్ష్మి పథకంలో ఇండ్లు నిర్మించుకున్నవారికి బిల్లులను ఆడబిడ్డలకే మంజూరు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకవేళ భర్త పేరుమీద స్థలం ఉన్నా భార్య పేరున ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుందన్నారు. శనివారం ఆయన బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో మోస్రా, చందూర్ మండలాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులను అందజేశారు. సభాపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల బిల్లులు రూ.300 కోట్లు మంజూరైతే, బాన్సువాడకు రూ.150 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుల బిల్లులు రూ.42 కోట్లు రావాల్సి ఉండగా.. ఇందులో రూ.21.71 కోట్లు వచ్చాయని చెప్పారు. మిగతావి వారం పది రోజుల్లో వస్తాయన్నారు. రూ.3 లక్షల పథకంలో టెండర్లు ఉండవని తెలిపారు. మూడు విడుతలుగా నేరుగా ఖాతాల్లో డబ్బులు జమచేస్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి , చందూర్ సర్పంచ్ సాయిరెడ్డి, అంబర్ సింగ్ , పత్తి రాము తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్, మార్చి 11: బీర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం అథితిగృహంలో ఉమ్మడి బీర్కూర్ మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు షాదీముబారక్, 195 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన చెక్కులను సభాపతి పోచారం శనివారం అందజేశారు. రూ. 3 లక్షల పథకం బాన్సువాడ నియోజకవర్గం నుంచే ప్రారంభమైందన్నారు.