బాన్సువాడ రూరల్, జూన్ 19 : అడవులను ధ్వంసం చేయకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ఎనిమిది విడుతలుగా 277 కోట్లు, జిల్లాలో 8 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని మొగులాన్పల్లి తండా శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ హరితోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పీకర్ హాజరయ్యారు. మొగులాన్పల్లి శివారులో 10 హెక్టార్లలో 11వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని డీఎఫ్‌వో నిఖితతో కలిసి ప్రారంభించారు.
అనంతరం అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభాపతి పోచారం మాట్లాడుతూ.. మానవ జాతికి చెట్లు తల్లితో సమానమని అన్నారు. మానవ మనుగడకు చెట్లు అండగా ఉంటాయని పేర్కొన్నారు. పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుంటాయని తెలిపారు.రాష్ట్రంలో 2.50 కోట్ల హెక్టార్లలో అటవి విస్తీర్ణం ఉన్నదని, అడవులను ధ్వంసం చేస్తే వాతావరణంలో సమత్యులం లోపించి మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని అన్నారు. అడవులను నరికివేయడంతో కోతులు, ఇతర అటవీ జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయన్నారు. అడవులను కాపాడాలని, హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కోరారు.
త్వరలో పోడుపట్టాల పంపిణీ
ఉమ్మడి జిల్లాలో త్వరలోనే 2,104 మంది పోడు రైతులకు పట్టాలను పంపిణీ చేస్తామని స్పీకర్ తెలిపారు. తెలంగాణ హరితోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అంతకుముందు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను స్పీకర్ ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిప్లిబాయి, ఆర్డీవో రాజాగౌడ్, బాన్సువాడ అటవీశాఖ అధికారి సంజయ్‌గౌడ్, ఎంపీపీ దొడ్ల నీరజారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, తిర్మలాపూర్ సర్పంచ్ జిన్న రఘురామయ్య, బీఆర్ఎస్ నాయకులు పిట్ల శ్రీ ధర్, దొడ్ల వెంకట్రాంరెడ్డి, మల్లారెడ్డి, రాచప్ప, ఉస్మాన్, సలీం, న్యూరాం, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ మాతాశిశు దవాఖానలో మొక్కలు నాటిన స్పీకర్
బాన్సువాడ, జూన్ 19 : బాన్సువాడ లోని మాతాశిశు దవాఖానలో నిర్వహించిన హరితోత్సవంలో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, పాలకవర్గ సభ్యులు, దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, వైద్య సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సభాపతిని వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, వైద్యులు సుధ, మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేశ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ షేక్ జుబేర్, హెడ్ నర్సు ఆరోగ్య జ్యోతి, కౌన్సిలర్లు శ్రీనివాస్, ఆమేర్, హకీం, హైమద్, రవీందర్ రెడ్డి, వెంకటేశ్, కిరణ్ కుమార్, రుక్మిణి, రమాదేవి, దవాఖాన సిబ్బంది ఆనంద్, రఘు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.