కంఠేశ్వర్, ఏప్రిల్ 23: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 130కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిని నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాల రైతులు సందర్శించారు. ఆధునిక సాగు ప రికరాలు, అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు, మేలు జాతి పాడి పశువులు తదితర అంశాలను స్టాళ్లలో ప్రదర్శించారు.
వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్యశాఖ అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీతోపాటు ఇతర పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు పాల్గొని, పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. చివరి రోజు స్టాళ్లను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్‌తోపాటు పలువురు నాయకులు, రైతులు సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో రైతు మహోత్సవం నిర్వహించడంతో జిల్లా రైతులతోపాటు కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల రైతులకు ఎంతో మేలు చేసిందని చెప్పారు. కలెక్టర్‌తోపాటు జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్‌రావు, వివిధ శాఖల అధికారులున్నారు.