రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రైతుధర్నాకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. మాజీమంత్రి, ఎమ్మెల్యే వేములతోపాటు మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంపగోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్‌షిండే, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా తదితరులు రైతుధర్నాలో పాల్గొని మాట్లాడారు. బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, రైతులు ధర్నా చేశారు.
డిచ్పల్లి, ఆగస్టు 22: అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి గెలిచాక కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందని ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ విమర్శించారు. డిచ్‌పల్లిలో నిర్వహించిన ధర్నా లో పాల్గొన్న ఆయన.. సీఎం రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలుగాలని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాంబార్ మోహన్, రమేశ్ నాయక్, దాసరి లక్ష్మీనర్సయ్య, శక్కరికొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, నీరడి పద్మారావు, హన్మంతరావు, తనూజ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్/బిచ్కుంద, ఆగస్టు 22: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. బిచ్కుంద, మద్నూర్‌లో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీల ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని, వెంటనే రైతులను క్షమాపణలు కోరాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నూతన ప్రభుత్వంలో ఇప్పటివరకు అభివృద్ధి పనులకు సంబంధించి కొత్తగా ఒక్క జీవో కూడా రాలేదని తెలిపారు. తాను మంజూరు చేయించిన అభివృద్ధి పనులను సైతం నిలిపివేస్తున్నారని అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నియోకవర్గ అభివృద్ధి చేయడానికి వచ్చాడో, కార్యకర్తల అంతు చూసేందుకు వచ్చాడో తెలియడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు బన్సీపటేల్, హన్మాండ్లు, విజయ్‌కుమార్, గఫార్, గోవింద్, సంజయ్, నాగేశ్, మారుతి, దేవీదాస్, రాజేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.