భీమ్‌గల్, జనవరి 24 : ఎన్నికల సందర్భంగా గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ జూపిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో బుధవారం పర్యటించి రూ. కోటీ 15లక్షల నిధులో పూర్తిచేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జాగిర్యాల్, పల్లికొండ, పిప్రి గ్రామాల్లో నిర్మించిన హెల్త్ సబ్‌సెంటర్లు, రూప్లాతండా, దేవన్‌పల్లి, లింగాపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, బడాభీమ్‌గల్‌లో బస్సు షెల్టర్, భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మా ట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీనీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి నిర్మించుకున్న గ్రామ పంచాయతీలు, హెల్త్ సబ్సెంటర్లను ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు.
ప్రతి హెల్త్ సబ్సెంటర్లో ఎంబీబీఎస్ డాక్టర్‌ను నియమిం చాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి విన్నవించగా, కేసీఆర్ అంగీకరించారని గుర్తుచేశారు. ఆ మేరకు సబ్సెంటర్లలో నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గ్యారెంటీల పేరిట కొత్త ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టిందని వేము లు అన్నారు. ఎకరానికి రూ.15వేల చొప్పు న రైతుబంధు, రూ. 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని ప్రకటించారని, కానీ నేడు ఇంటింటికీ వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ప్రతినెలా రూ.2,500 అందజేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి గుర్తు చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్, పంచాయతీరాజ్ శాఖ అధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు.