ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 14: ఒకవైపు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు ప్రత్యేక రోజుల్లో అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి అందినకాడికి దోచుకుంటున్నది. ముఖ్యంగా పండుగ సందర్భంగా ఆర్టీసీలో పెరిగిన రద్దీని ముందే పసిగట్టిన అధికారులు.. స్పెషల్ పేరుతో ప్రత్యేక బాదుడుకు తెరలేపారు. పల్లెవెలుగు బస్సులను ప్రత్యేకంగా నడిపిస్తూ ప్రయాణికులను నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.
గురువారం ఎల్లారెడ్డి బస్టాండ్ నుంచి బాలానగర్ వెళ్లడానికి భవానీపేట్ గ్రామానికి చెందిన నవీన్ పల్లె వెలుగు బస్సు ఎక్కాడు. రూ.270 టికెట్ ఇవ్వడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కండక్టర్ను ఇదెక్కడి వడ్డింపు అని అడిగినా లాభం లేకుండా పోయింది. సూపర్ లగ్జరీ బస్సుకు రూ.250 ఉండగా.. పల్లెవెలుగు స్పెషల్ బస్సుకు 270 రూపాయలు తీసుకోవడం చాలా ఎక్కువ అని సదరు ప్రయాణికుడు ఆవేదన వ్యక్తంచేశాడు. పండుగల సమయంలో ఆర్టీనరీ బస్సులను స్పెషల్ పేరుతో ప్రయాణికుల నుంచి ముక్కుపిండి డబ్బులను వసూలు చేస్తున్న ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.