నిజామాబాద్ రూరల్/ సిరికొండ, జనవరి 11 : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన బి.నర్సయ్య కొన్ని నెలల క్రితం బస్సు ప్రమాదంలో మృతిచెందాడు. బాధిత కుటుంబానికి ఆర్టీసీ ద్వారా రూ. 10 లక్షలు మంజూరు కాగా.. సంబంధిత చెక్కును రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ బుధవారం అందజేశారు. మృతుడి భార్య లక్ష్మీకి రూ.5 లక్షలు, మిగతా ముగ్గురు కుటుంబసభ్యులకు కలిపి రూ.5 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్నారు. ఆర్టీసీ అందజేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, కేసీఆర్ సేవాదళ్ రూరల్ సెగ్మెంట్ కన్వీనర్ కోర్వ దేవేందర్ పాల్గొన్నారు.
డిచ్పల్లి, జనవరి 11 : ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లి – సౌమ్యనాయక్ తండాకు చెంది మాజీ సర్పంచ్ తిమ్మిబాయి భర్త మోతీలాల్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. వారి కుటుంబంతో పాటు పలు కుటుంబాలను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం పరామర్శించారు. చంద్రాయన్పల్లి గ్రామంలో ఇటీవల మృతిచెందిన రవీనా కుటుంబాన్ని పరామర్శించి, ఆమెకు మంజూరైన రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. ఆర్టీసీ చైర్మన్ వెంట ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ఉన్నారు.