Accident | వినాయక నగర్, జూన్ 19 : నిజామాబాద్ మండల పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన ఓ ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం గండి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడడంతో ఆటోలో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రయాణికు ఉన్న ఆటో బోల్తాపడడంతో దారి వెంట వెళుతున్న పలువురు వాహనదారులు హుటాహుటిన వెళ్లి బోల్తాపడిన ఆటోను పైకి తీసి అందులో ఉన్న ప్రయాణికులను ఆటోలోంచి బయటకు తీశారు.
బాన్సువాడ డిపోకు చెందిన బస్సుతో ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తన సిబ్బందితోపాటు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఆయన ప్రమాదం జరిగిన తీరుపై తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయాల పాలైన ప్రయాణికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మల్లారం గండిలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో రోడ్డు మధ్యలో జరిగిన ఈ ప్రమాదం వల్ల దారి వెంట వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. దీంతో కొద్ది సమయం పాటు గండి ప్రాంతంలో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఎండి ఆరిఫ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.