మాక్లూర్, ఆగస్టు 21: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతుల కల సాకారం కాబోతున్నది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని చిక్లీ, కొత్తపల్లి, కంఠం, వల్లభాపూర్, గుంజిలి గ్రామాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కానున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి చిక్లీ -కంఠం ఎత్తిపోతలపై అసెంబ్లీలో మాట్లాడారు. రైతుల బాధలను వివరించి, అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావును ఒప్పించి లిఫ్ట్ కోసం రూ.132 కోట్లు మంజూరు చేయించారు. సాంకేతిక కారణాలతో లిఫ్ట్ పనులు ప్రారం భం కాలేదు.
తాజాగా రూ.132కోట్లు మంజూరు కావడంతో కాంట్రాక్టర్ లిఫ్ట్ పనులు ప్రారంభించేందుకు నీటిని తరలించే పైపులను పెద్ద సంఖ్యలో ఆయా గ్రామాలకు బుధవారం చేరవేసినట్లు బీఆర్ఎస్ మండల యూత్ ఉపాధ్యక్షుడు దిమెర శ్రీకాంత్, నాగేశ్ తెలిపారు. బినోలా దగ్గర గోదావరి నుంచి చిక్లి పెద్ద చెరువు వరకు లిఫ్ట్ నీరు వచ్చేలా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవ తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు రమేశ్, భోజన్న, రంజిత్, నవీన్, సాయన్న, శేర్ఖాన్, శేఖర్, రాజేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు