Nizamabad | కంటేశ్వర్, సెప్టెంబర్ 18 : ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని, అందుకోసం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదరపు కలెక్టర్ భుజంగరావు అధికారులను ఆదేశించారు. 2026-2027 వానాకాలం సీజన్ వరి ధాన్యం సేకరణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలోని కాన్ఫరెన్సు హాల్ లో శుక్రవారం అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భుజంగరావు మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తేనున్న నేపథ్యంలో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈసారి సుమారు 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో 736 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. వీటిలో ఐకేపీ ద్వారా 249 కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా గిడ్డంగులను గుర్తించాలన్నారు.
తహసీల్దార్లతో క్షేత్రస్థాయిలో గోడౌన్లను పరిశీలింపజేసి, వాస్తవ నిల్వ సామర్థ్యం గుర్తించాలన్నారు. మార్కెట్ కమిటీలకు చెందిన గోడౌన్లు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్ లలో ఇప్పటికే భద్రపరచి ఉన్న మొక్కజొన్న నిల్వలను వెంటనే తరలించేలా మార్క్ ఫెడ్ అధికారులకు లిఖితపూర్వకంగా కోరాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే కృషి చేయాలని, ఈ విషయంలో సంబంధిత శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ధాన్యం దిగుబడులు చేతికందే సమయానికి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని అదనపు కలెక్టర్ సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి, ప్రభుత్వంచే ఎంపిక చేయబడిన రకాలకు చెందిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, పూర్తిస్థాయి మద్దతు ధర పొందేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలోనూ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూర్చాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట గోడౌన్లకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలలో సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ప్రక్రియ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటదివెంట జరిగేలా ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఏ చిన్న ఇబ్బందికి సైతం తావులేకుండా ధాన్యం సేకరణను సజావుగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ ఆభిగ్యాన్ మాల్వియ, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, డీఆర్డీఓ సాయన్న, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి , జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిణి గంగూబాయి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.