నవీపేట, అక్టోబర్ 27: నవీపేట మండల కేం ద్రంలో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణంలోకి దుండగులు చొరబడి ఆరు కిలోల వెండి, తులం బంగారం ఎత్తుకెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే బాసర ప్రధాన రోడ్డులో ఉన్న దుకాణంలో సోమవారం తెల్లవారుజామున దుండగులు దోపిడీకి పాల్పడగా.. ఈ ఘటన పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంగా చోటుచేసుకోవడం గమనార్హం. షాపు యజమాని నాంపల్లి పవన్, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నందిపేట వైపు నుంచి గుర్తు తెలియని ముగ్గురు దుండగులు మాస్కు, నల్లని డ్రెస్‌లు ధరించి సోమవారం తెల్లవారుజామున బైక్‌పై నవీపేటకు వచ్చారు. ఎస్బీఐ పక్కన ఓ సందులో బైక్‌ను పార్క్‌చేసి వైష్ణవి సిల్వర్ మర్చంట్ షాపు వద్దకు నడుచుకుంటూ వచ్చారు.
అప్పటికే వాహనాలు రాకపోకలు సాగిస్తుండగానే వెంట తెచ్చుకున్న ఎలక్ట్రికల్ కట్టర్ సా యంతో వైష్ణవి సిల్వర్ మర్చం ట్ షట్టర్‌కు వేసి ఉన్న తాళాలను కట్ చేయసాగారు. శబ్దం రావడంతో పక్క భవనం లో అద్దె కు ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలు నిద్ర లేచారు. వారిని దొంగలు తమ వద్ద ఉన్న రాళ్లతో బెదిరించగా భయపడిన కూలీలు లోపల నుంచి గడిపెట్టుకున్నారు. షట్టర్‌ను కట్‌చేసి లోనికి వెళ్లిన దుండగులు సీసీ కెమెరాలపై ఫోమ్ స్ప్రేచేశారు. షాపులో నుంచి ఆరు కిలోల వెండితో పాటు తులం బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చోరీ జరిగిన దుకాణాన్ని నిజామాబాద్ సీసీఎస్ ఏసీసీ నాగేంద్రా చారి సోమవారం పరిశీలించారు. బయట ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. దొంగలను పట్టుకోవడానికి అన్ని కోణాల్లో గాలింపు చర్యలు చేపడు తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి పేర్కొన్నారు.