మోర్తాడ్, ఆగస్టు 7: బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై పనులు ప్రారంభించగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడంతో పనులు ముందుకుసాగడంలేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నర్సాపూర్, ఇనాయత్‌నగర్, దొమ్మర్సౌడ్ తండా, కోనాపూర్, భూషణ్రావుపేట్ గ్రామాల రోడ్డు అధ్వానంగా మారడంతో రోడ్డు రెన్యూవల్‌కు, రోడ్డు విస్తరణ కోసం అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నిధులు మంజూరు చేశారు. 2023 జూలై 13న నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి.
నడక నరకప్రాయం
కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ నుంచి వయా ఇనాయత్‌నగర్, దొమ్మర్సౌడ్ తండా, కోనాపూర్ మీదుగా జగిత్యాల జిల్లాలోని భూషణ్రావుపేట్ వరకు రోడ్డు రెన్యూవల్ కోసం రూ.3.16కోట్లు, రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.6.20కోట్ల నిధులను అప్పటి రాష్ట్రరోడ్లు భవనాలుశాఖ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మంజూరు చేశారు. శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభంమయ్యాక వర్షా లు కురవడం, ఎన్నికల కోడ్ రావడంతో పనులకు అంతరాయం ఏర్పడి నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పనులు ముందుకుసాగడంలేదు.
కమ్మర్పల్లి మండలంలోని పలు గ్రామాల వారికి జగిత్యాల జిల్లాలోని కథలాపూర్, కోరుట్ల, వేములవాడ వెళ్లేందుకు ఈరోడ్డు సౌకర్యంగా ఉంటుంది. కోనాపూర్ గ్రామంలో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్ట్‌ను చూసేందుకు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ప్రతి వానాకాలం జనం ఎక్కువగా వస్తుంటారు. ఈనేపథ్యంలో ఈ రోడ్డు ప్రయాణానికి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభింపజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పనులు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఇనాయత్‌నగర్ నుంచి కోనాపూర్ వరకు, కోనాపూర్ నుంచి భూషణ్రావుపేట్ వరకు రోడ్డు అధ్వాన్నంగా మారింది. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. వర్షాలు కురిస్తే బురదమయంగా మారి నరకం కనిపిస్తున్నది. రెండేండ్లయినా పనులు ముందుకు సాగకపోవడంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగేలా చూడాలని నర్సాపూర్, ఇనాయత్‌నగర్, డీసీతండా, కోనాపూర్, జగిత్యాల జిల్లా భూషణ్రావుపేట్ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు పనులు జరిగేలా చూడాలి
రోడ్డు పనులు ప్రారంభం కాగానే సంతోషించాం. కానీ ప్రభుత్వం మారగానే పనులు ఆగిపోవడంతో ప్రయాణం చేయడం ఇబ్బందిగా మారింది. వర్షాలు కురిస్తే రోడ్డు బురద మయంగా మారుతున్నది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నాం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు జరిగేలా చూడాలి.
– పురుషోత్తం, కోనాపూర్