కంఠేశ్వర్, జూలై 26 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యం త్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి శనివారం భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరి యా, ఎరువుల నిల్వలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాలతో ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ఏరియాలో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నదని, ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. వరద జలాలు ప్రవహించే ప్రాంతాల మీదుగా ప్రజలు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించాలని సూచించారు.
వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
భారీ వర్షాలతో వరద పరిస్థితి ఉత్పన్నమైతే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు..కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌తో పా టు అగ్నిమాపక శాఖ, పోలీసు, మున్సిపల్ తదితర కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08462-220183 కు సమాచారం అందించాలని సూచించారు. కూలిపోయే స్థితి ఉన్న నగరంలోని 167 ఇండ్ల యజమానులకు ఖాళీ చేయాలని నోటీసులు అందించామని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు.