నిజామాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ వైద్యారోగ్య శాఖ గాడిలో పడడం లేదు. ప్రజాపాలన షురూ అయ్యాక పరిస్థితి అధ్వానంగా మారింది. శాశ్వత అధికారిగా డీఎంహెచ్‌వో నియామకమైనప్పటికీ గందరగోళం చోటు చేసుకుంటున్నది. తాజాగా తాత్కాలిక ఉద్యోగ నియామకాల్లో డీఎంహెచ్‌వోకు చెందిన ఓ వ్యక్తి బహిరంగంగానే ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేయడం కలకలం రేపుతున్నది. నియామకప్రక్రియ పారదర్శకంగా చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇన్చార్జి డీఎంహెచ్‌వో ఉన్నప్పుడు పరిపాలన గందరగోళంగా ఉండేది. ఇష్టారీతిన అక్రమాలు జరిగాయి. అడిగేవారు లేకపోవడంతో పాత అధికారి పెత్తనం అంతటా వ్యాపించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలను నడిపి జేబులు నింపుకొన్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏకంగా డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే ఏసీబీ దాడులు జరిగాయి. సోదాలు రోజుల తరబడి చేపట్టారు. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే అవినీతిపరులు చిక్కారు. శాఖ పరువును మంటగలిసిపోతున్నప్పటికీ కొంతమందిలో మార్పు రాకపోవడం చర్చనీయాంశం అవుతున్నది.
ప్రతి పనికీ వసూళ్లు…
ఏడాది క్రితం నిజామాబాద్ జిల్లాలో 30 స్టాఫ్ నర్సులు, ముగ్గురు ఏఎన్ఎంల భర్తీ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చినా ఈ ప్రక్రియను కొంతమంది డీఎంహెచ్‌వో ఉద్యోగులు డబ్బులు దండుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తం 876 దరఖాస్తులు రాగా వీరిలో అర్హులైన వారి జాబితాను చేజిక్కించుకున్నారు. వారి వివరాలను తెలుసుకుని ఫోన్లు చేసుకుంటూ బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేశారు. మీకు ఉద్యోగం రావాలంటే రూ.లక్షన్నర చెల్లించుకోవలంటూ డిమాండ్‌ను ముందుంచారు. ముందస్తుగా రూ.25 వేలు చెల్లించాలని కోరారు. కొంతమంది డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంకాగా.. మరికొంత మంది కంగుతిని, ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా కనీసం పట్టించుకోవడం లేదు. బాధితులే వెళ్లి పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చుకోవాలంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. నియామకాలను పారదర్శకంగానే చేపడతామంటూ చెబుతున్నప్పటికీ, అవినీతి ఆరోపణలు వెలుగుచూసిన దరిమిలా విచారణ చేపట్టి ఇంటి దొంగల భరతం పట్టేందుకు నడుం బిగించకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడేం కొత్త కాదు. డీఎంహెచ్‌వోలో తరచూ జరిగే తంతు. వసూల్ రాజాతో చాలా మందికి పరిచయాలున్నాయి. వారితో ఆర్థిక సంబంధాలున్న నేపథ్యంలో వీరిని కదిపితే చాలా మందికి ఉద్యోగ ముప్పు పొంచి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. అందుకే ఇంత జరుగుతున్నా ఉలుకూ పలుకూ లేదని వైద్యారోగ్య శాఖపై విమర్శలు వస్తున్నాయి.
కల్పతరువుగా ప్రైవేటు దవాఖానలు..
వైద్యారోగ్యశాఖలో ఏండ్లుగా పాతుకుపోయిన కొంతమంది వ్యక్తుల పాత్ర వివాదాస్పదమవుతున్నది. దవాఖానల పర్మిషన్ల దగ్గరి నుంచి తనిఖీల వరకూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నిరంతర తనిఖీలు చేపట్టి దవాఖానల్లో జరుగుతున్న ప్రజావ్యతిరేక చర్యలను అరికట్టాల్సి ఉండగా అవేమీ జరగడం లేదు. నిజామాబాద్‌లో వందలాది దవాఖానలకు డీఎంహెచ్‌వోకు చెందిన ఓ కీలక ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఏ చిన్న ఘటన వెలుగుచూసినా రంగంలోకి దిగి మేనేజ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. చివరికి పోలీసులను సైతం పక్కదారి పట్టించి దవా ఖానల్లో జరిగే కేసులకు మీకు సంబంధం లేదంటూ దబాయిస్తున్నట్లుగా తెలిసింది. ప్రైవేటు దవాఖానలైతే అక్రమార్కులకు కల్పతరువుగా మారాయి. అడిగినంత మా మూళ్లు ఇచ్చుకుంటున్న నేపథ్యంలో ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలు సైతం బరితెగించి పోతున్నాయి. జిల్లాస్థాయి అధికారి తనిఖీలకు వచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయిలో మేనేజ్మెంట్ చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతున్నది చెబుతున్నారు. వైద్యారోగ్య శాఖలో వేలు పెట్టేందుకు జిల్లా ఉన్నతాధికారి సైతం ఆసక్తి చూపకపోవడంతో అక్రమార్కుల తీరు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా పేట్రెగిపోన్నది. దీనికి అడ్డుకట్ట వేయాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.
పారదర్శకంగా చేపడతాంకాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపడుతున్న ఉద్యోగాల నియామకాలను పారదర్శకంగా చేపడతాం. అక్రమంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. బాధితులనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పాం. మేము స్పందించేందుకు ఎలాంటి ఆధారం మాకు దొరకడం లేదు. మా శాఖ సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? లేదా? అన్నది తెలుసుకుంటాం.
– రాజశ్రీ, డీఎంహెచ్‌వో, నిజామాబాద్
స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం ఉద్యోగం కావాలా? అయితే, రూ.లక్షన్నర చెల్లించండి.అడ్వాన్సుగా రూ.25 వేలు ఇవ్వాల్సి ఉంటుంది మరి..