వనపర్తి, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ గ్యాస్ ఇక్కట్లు మొదలయ్యాయి. కంపెనీల నుంచి క మర్షియల్ సిలిండర్ల సరఫరా ఏజెన్సీలకు ఓ పది రోజుల కిందటే నిలిచింది. అయితే హో టళ్లు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో మాత్రం కమర్షియల్ సిలిండర్లు దర్జాగా కనిపిస్తుండడం.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లాలో వంట గ్యాస్‌కు ఇబ్బందులు మొదలవ్వలేదు. సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామ ని ఆయా గ్యాస్ కంపెనీలు వెల్లడిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకా రం జిల్లా వ్యాప్తంగా 1,17,906 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఎ లాంటి షరతులు లేకుండా గ్యాస్ సరఫరా జరిగింది. అయితే ప్రస్తుతం ప ట్టణ పరిధిలో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాలకు 45 రో జుల బుకింగ్ గడువును నిర్ణయించాయి.
తూతూ మంత్రంగా తనిఖీలు..
గ్యాస్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఇటీవల జిల్లా పౌరసరఫరాల శాఖ తనిఖీలు నిర్వహించింది. 6 చిన్న వ్యాపార దుకాణాల్లో పది గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద హోటళ్లు, ఇతర వ్యాపార కేంద్రాల్లో వంట గ్యాస్ నింపిన కమర్షియల్ సిలిండర్లతో యథేచ్ఛగా వంటలు వండుతున్నారు.
పెరిగిన బుకింగ్..
గ్యాస్ కొరతను ఊహించిన వినియోగదారులు ముందే అలర్ట్ అయ్యారు. కొరత లేదని, రాదని అధికారులు ఎంత చెప్పినా బుకింగ్ శాతం రెండింతలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ‘సందట్లో సడేమియా’.. అన్నట్లు అవసరం ఉన్న వారు, లేని వారు ఒకేసారి ముందుకు రావడంతో డబుల్, త్రిబుల్కు చేరింది. వంట గ్యాస్‌ను కమర్షియల్‌కు షిఫ్ట్ చేసే దళారులు సైతం ఈ బుకింగ్‌లో చొరబడటంతో డిమాండ్ పెరిగింది. ఒక వంట సిలిండర్‌కు రూ.300 అధికంగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వినికిడి.
జిల్లాలో 11 ఏజెన్సీలుంటే.. వనపర్తి జిల్లాలో పౌర సరఫరాల
శాఖ లెక్క ప్రకారం 11 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో వనపర్తిలో 2, ఆత్మకూరులో 2, కొత్తకోట, పెబ్బేరు, గోపాల్పేట, పెద్దమందడి, పాన్‌గల్, వీపనగండ్ల, ఘణపురంలో ఒక్కో ఏజెన్సీ ఉన్నది. డొమెస్టిక్ సింగిల్, డబుల్ కనెక్షన్లతోపాటు కమర్షియల్, దీపం, ఉజ్వల, సీఎస్ఆర్ కింద 1,17,906 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 568 మాత్రమే కమర్షియల్ కనెక్షన్లున్నాయి. కొత్తకోట గాయత్రీ భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో 245 కమర్షియల్ కనెక్షన్లు ఉంటే.. వనపర్తిలో మాత్రం బాలాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో కేవలం 60 మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన వ్యాపార రంగంలో ఎంత వంట గ్యాస్‌ను ఉపయోగించే అవకాశం ఉందో అర్థమవుతోంది.
గోప్యంగా షిఫ్ట్
పది రోజుల నుంచి కమర్షియల్ గ్యాస్ సరఫరా ఏజెన్సీలకే నిలిచిపోయింది. ఒకటో, రెండు వచ్చినా అవి వ్యాపార వర్గాల వారికి ఏజెన్సీలు విక్రయించే పరిస్థితుల్లేవు. ఎమర్జెన్సీ సర్వీస్‌ను దృష్టిలో ఉంచుకొని వైద్య, ఆరోగ్య శాఖ, ఇతర ప్రభుత్వ రంగ సర్వీసులకు మాత్రమే కమర్షియల్ సిలిండర్లను అందించే అవకాశం ఉంది. అయితే హోటళ్లు, ఇతర రంగాల్లో కమర్షియల్ సిలిండర్లు యథావిధిగానే పని చేస్తున్నాయి. 15 రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిస్థితిలో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎప్పుడు తీసుకున్నారు.. రసీదులున్నాయా? అన్నది సందిగ్ధంగా మారింది. ఇదిలా ఉంటే.. వంట గ్యాస్‌ను కమర్షియల్‌గా గుట్టుచప్పుడు కాకుండా షిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ గ్యాస్ సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి దందా నడిచినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోనే అధికంగా వంట గ్యాస్‌ను షిఫ్ట్ చేసే దళారులు రహస్యంగా ఈ తంతంగాన్ని నడిపిస్తూ పైకి మాత్రం కమర్షియల్ సిలిండర్లు వాడుతున్నట్లు కనిపించేలా వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటున్న తెలుస్తుంది.
కమర్షియల్ సిలిండర్ల పంపిణీ లేదు
పది రోజులకుపైగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ నిలిచిపోయింది. యుద్ధం పరిస్థితి ఉన్నా ఎలాంటి ఇబ్బం దుల్లేకుండా వంట గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఎప్పటిలాగే పైనుంచి పం పిణీ జరుగుతుంది. అయితే వినియోగ దారులు మాత్రం బుకింగ్‌కు ఎగబడు తున్నారు. రోజు 400లోపు ఉండే బుకింగ్స్.. ఇప్పుడు 1200కు చేరాయి. ముందు బుక్ చేసుకున్న వారిలో రోజు 500 వరకు సిలిండర్ల సరఫరా చేస్తున్నాం. అనవసరంగా గాబరా పడి అధికంగా బుకింగ్ చేసుకోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది.
– మంజునాథ్, మేనేజర్, బాలాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీ, వనపర్తి