హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండోర్‌లో జరిగిన 87వ యూటీటీ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ పురుషుల టీమ్ 0-3 తేడాతో టైటిల్ విజేత పీఎస్‌పీబీ చేతిలో ఓటమిపాలైంది. తెలంగాణ తరఫున బరిలోకి దిగిన అలీ 9-11, 11-9, 6-11, 7-11తో పయాస్ జైన్ చేతిలో ఓడగా ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ 7-11, 7-11, 11-7, 13-11తో మానవ్ థక్కర్‌పై పోరాడి ఓటమిపాలయ్యాడు.
మరో పోరులో స్వర్ణేందు 7-11, 11-8, 8-11, 6-11తో హర్మీత్దేశాయ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ పోరులో తెలంగాణ టీమ్ 3-1తో కర్ణాటకపై అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన వేర్వేరు గేముల్లో స్నేహిత్ 11-9, 11-3, 13-11తో యశ్వంత్‌ను చిత్తు చేయగా, అలీ 5-11, 11-8, 11-9, 11-4తో అథర్వ నవరంగెపై గెలిచి జట్టు విజయంలో కీలకమయ్యాడు.
జట్టును కోచ్ సోమ్‌నాథ్ ఘోష్, మేనేజర్ చైతన్య అభినందించారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ 12-10, 12-10, 7-11, 13-15, 4-11తో తనీశా చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.