Kotagiri | కోటగిరి, సెప్టెంబర్ 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీలిచ్చి వాటినీ అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందని రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలకు మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్ మండి పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం కాలయాపన చేస్తూ ప్రజలకు మోసం చేసిందని సోమవారం కోటగిరి మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ‘ప్రజావాణి’లో అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 420 హామీలను అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి నేడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్న ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా వారి పేద కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ తాము అధికారంలోకి వచ్చాక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తోపాటు తులం బంగారం ఇస్తామని బూటకపు అబద్ధాలు చెప్పి నేడు ఆ పథకాలను పూర్తిగా పక్కన పడేసిందన్నారు.
ప్రస్తుతం ఉన్న పెన్షన్ కంటే అదనంగా మరో రూ.2వేల ఇస్తామని ప్రతీనెల రూ.4వేల చొప్పున పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి నేడు వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పేర్ల రవికుమార్, మోరే కిషన్, దేవేందర్, పారూక్, నజీర్, కప్ప సంతోష్, మంజునాథ్, యోగేష్, సందీప్, మొగుళప్ప తదితరులు పాల్గొన్నారు.