కామారెడ్డి, సెప్టెంబర్ 26 : ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అమలుచేయకుండా మాట తప్పిందని మండిపడ్డారు.
ప్రజలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేసిన చరిత్ర సీఎం రేవంత్‌రెడ్డిదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతామని అన్నారు. ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వీడి ద్రోహం చేసిన వారిని విడిచిపెట్టేదిలేదని ఆయన హెచ్చరించారు.
పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, పార్టీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు పగడాల బాల్‌చంద్రం, మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, కూచని శేఖర్, హంజీనాయక్, బూస శ్రీను, గంగారెడ్డి, గోవింద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షుడిగా ఇసాయిపేట గ్రామానికి చెందిన బొంబోతుల రాజాగౌడ్, ప్రధాన కార్యదర్శిగా విద్యాసాగర్‌రావును నియమించారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు.