నిజామాబాద్ (ఖలీల్‌వాడీ) : మందకృష్ణ మాదిగకు భయపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాలలను అణచివేస్తున్నారని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ (Pilli Sudhakar) ఆరోపించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సమావేశం స్థానిక మాల సంఘ భవనంలో జిల్లా అధ్యక్షులు పులి జైపాల్ అధ్యక్షతన శనివారం జరిగింది.
ఈ సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ మాలల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మాలల్ని అణచివేస్తూ వారి ఉనికిని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగ ( MandaKrishna Madiga) బెదిరింపులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని విమర్శించారు. జస్టిస్ షమీం అక్తర్‌తో తప్పుడు తడకాగా రిపోర్టు రూపొందించారని అన్నారు.
కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. మాల ఉప కులాలు మధ్య మందకృష్ణ మాదిగ చిచ్చుపెట్టి మాలలపై విషం చిమ్ముతున్నాడని, తన పద్ధతిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కిరణ్ పాల్, బెల్లిడిగ చంద్రకాంత్, గంగారం, తుక్కడి నారాయణ, ఎబినైజర్, దినకర్, భాస్కర్, సుభాష్, సురేష్, బైండ్ల రాజన్న , మైకేల్, దయాకర్, సురేష్ టింకుల్, ఉదయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.