భీమ్గల్, ఏప్రిల్ 9: రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అదే అన్నదాతలను తీవ్రంగా సతాయిస్తున్నది. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా వంచించిన రేవంత్ సర్కారు.. కష్టపడి పండించిన పంటను సైతం సకాలంలో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నది. యాసంగి వరి కోతలు ప్రారంభమై పక్షం రోజులు దాటుతున్నా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల జాడ లేకుండా పోయింది. ఫలితంగా కల్లాలతో పాటు రోడ్లపైనా వడ్ల రాశులే కనిపిస్తున్నాయి. పంటను అమ్ముకోలేక, అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోలేక రైతులు తిప్పలు పడుతున్నారు. కుప్పల వద్ద వాలిపోతున్న దళారులకు ఎంతో కొంత ధరకు అమ్ముకుంటున్నారు.
యాసంగిలో ఉమ్మడి జిల్లాలో భారీగా వరి సాగయింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి రైతులు పంట సాగు చేశారు. ఫలితంగా ధాన్యం ఇబ్బడిముబ్బడిగా వస్తున్నది. అయితే, చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అగచాట్లు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక్క భీమ్గల్ మండలంలోని 27 గ్రామాల పరిధిలోనే 31 వేల ఎకరాల్లో వరి సాగైంది. ఈ మండలంలో సుమారు 40 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
గతేడాది ఆధ్వర్యంలో 17, భీమ్గల్ సొసైటీ ఆధ్వర్యంలో 22, ముచ్కూర్ సొసైటీ ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం సేకరించారు. కానీ ఈసారి ఇప్పటివరకూ ఒక్కటి కూడా ప్రారంభించలేదు. ప్రస్తుతం పంట కోతలు జోరందుకున్నాయి. వడ్ల రాశులతో కల్లాలు కళకళలాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో కొనుగోలు కేంద్రాల జాడ లేక కర్షకులు కలవరపాటుకు గురవుతున్నారు. ధాన్యం సేకరణకు అనుమతులు రావడం, రైస్మిల్స్ అలాట్మెంట్ చేయడం వంటి కీలక ప్రక్రియలు ఇంకా పూర్తి కాలేదని తెలిసింది.
కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, అకాల వర్షాలు వెంటాడుతున్న తరుణంలో దళారులు రంగంలోకి దిగారు. రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకుని తక్కువ ధరకే కొంటున్నారు. ఎండలు మండుతుండుతున్న తరుణంలో.. పంట కోసి తెచ్చిన ధాన్యం ఎండిపోయి రోజురోజుకూ బరువు తగ్గిపోతుంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల గురించి అధికార వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇప్పట్లో ప్రారంభమవుతాయా? అన్న మీమాంస రైతాంగంలో నెలకొంది. దీంతో వారు గత్యంతరం లేక దళారులకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై ప్రభుత్వం కొనే నాటికి ధాన్యం పూర్తిగా ఎండిపోయి బరువు తగ్గి నష్టపోయే బదులు తక్కువ ధరకైనా దళారులకు అమ్ముకున్నదే నయమనే నిర్ణయానికి వస్తున్నారు.