నిజామాబాద్, అక్టోబర్ 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. ఓ వైపు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంపు అమలు చేయాలని కోరుతున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పూటకో తీరుతో ప్రజలను గందరగోళంలో పడేసి చేతులు దులుపుకుంటోంది. పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ బిల్లుతో కొద్ది కాలం కాలం వెళ్లదీసింది. ఆ తర్వాత గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉందంటూ జాప్యం చేసింది. జీవో 9 తీసుకువచ్చి నాటకీయతను ప్రదర్శించింది. బిల్లు కాస్తా చట్టంగా మారకముందే హడావిడిని ప్రదర్శించి జనాలను తప్పుదోవ పట్టించారు. బీసీ ప్రజలను తమవైపు తిప్పుకోవాలనే ఏకైక రాజకీయ ఎత్తుగడతో ఇష్టానుసారంగా పాకులాడి ఇప్పుడు మరోసారి వాయిదాకే మొగ్గు చూపింది. వరుసగా హైకోర్టు, సుప్రీంకోర్టులో రేవంత్ సర్కారు ఇచ్చిన జీవో మనుగడే ప్రశ్నార్థకంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ తీరును బీసీ ప్రజానీకం, బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. అమలుకు నోచుకోని జీవోను జారీ చేసి బీసీలను వంచించడం సరికాదంటూ చెబుతున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో నోటికొచ్చిన ఎన్నికల హామీలను రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా హామీలను అమలు చేసి నిలబెట్టుకుంటానంటూ చెప్పాడు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో హామీలన్నీ అటకెక్కాయి. ఇప్పటి వరకు అరకొరగా హామీలు అమలయ్యాయి. మెజార్టీ హామీలు కనీసం పట్టాలెక్కలేదు. అందులో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కీలకంగా మారింది. ఇందులో 18 అంశాల్లో వివిధ కులాలకు తాయిలాలు ప్రకటించారు. అందులో మొదటి డిమాండ్ 42శాతం రిజర్వేషన్ అంశంగా ఉంది. రెండేండ్ల పరిపాలన కాలంలో ఒకే అంశం చుట్టూ కాలయాపన చేస్తూ రేవంత్ ప్రభుత్వం తెలివిగా తప్పించుకుంటోందని బీసీ ప్రజలంతా భావిస్తున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికే పూటకో తీరులో డ్రామాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు. 22 నెలల కాలంగా రైతుభరోసా, సన్న వడ్లకు బోనస్, మహిళలకు రూ.2500, యువతులకు స్కూటీలు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం, ఉద్యమ కారులకు ఇండ్ల స్థలాలు ఇలా ఏవీ మచ్చుకూ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఆయా వర్గాలు తీవ్ర స్థాయిలో కోపోద్రిక్తులు అవుతుండగా స్థానిక ఎన్నికలు జరిగితే కర్రు కాల్చి వాత పెట్టేందుకు బీసీ జనమంతా సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రతికూల పరిస్థితిని గమనించి స్థానిక ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేస్తున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలును కోరుతూ బీసీ సంఘాలు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శాంతియుతంగా బంద్‌ను నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి సైతం మద్దతు ప్రకటించింది. బీసీ సంఘాల జేఏసీ విన్నపానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు గులాబీ పార్టీకి చెందిన బీసీ నేతలంతా మూకుమ్మడిగా బంద్‌లో పాలుపంచుకోబోతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని, వెనుకబడిన వర్గాలకు హస్తం పార్టీ చేస్తున్న ఢోకాపై తేటతెల్లం చేసేందుకు గులాబీ పార్టీ నడుం బిగించింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో బీసీలకు పెద్ద పీట దక్కింది. బీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులను కేసీఆర్ కట్టబెట్టారు. అనేక మందిని ప్రోత్సహించి చట్టసభలకు పంపించారు. మంత్రులను చేసి ఉన్నత స్థాయికి తీసుకువచ్చారు. బీసీ వర్గాల కోసం అనేక పథకాలు తీసుకు వచ్చి ఆర్థికంగా సపోర్ట్‌గా నిలిచారు. కానిప్పుడు బీసీ వర్గాలకు ఇచ్చిన 42శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోగా గడిచిన 22 నెలల పాలనలో కనీసం ఒక్క పథకాన్ని తీసుకు రాలేదు. ఆర్థికంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టలేదు. బీసీలకు 42శాతం వాటా కోరుతూ వారంతా ఉద్యమ బాట పట్టడంతో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తనదైన పాత్ర పోషించడంతో పాటు బీసీలకు అండగా నిలుస్తోంది.