మోర్తాడ్/భీమ్గల్/ధర్పల్లి/సిరికొండ/వేల్పూర్/ఏర్గట్ల, మే 7: అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఓవైపు రేవంత్ సర్కారు సతాయిస్తున్నది. మరోవైపు అకాల వర్షాలతో ప్రకృతి ఆగం జేస్తున్నది. ప్రతికూల పరిస్థితులు వెంటాడుతుండడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, ధర్పల్లి, సిరికొండ తదితర మండలాల్లో బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యంతో పాటు కాంటాలు వేసిన బస్తాలు సైతం తడిసి ముద్దయ్యాయి.
ఆందోళనలో రైతులు..
కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లెక్కుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్ర జాప్యం జరగడం, వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రతిచోటా అధికారులను నిలదీస్తూనే ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం కమ్మర్పల్లిలోనూ రాస్తారోకో చేశారు. రైతులు ఆందోళన చెందుతున్నట్లుగానే అకాల వర్షం రానే వచ్చింది. వడ్ల కుప్పలను ముంచెత్తింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు.. సర్కారుపై మరింత రగిలి పోతున్నారు. కొనుగోళ్లు సజావుగా సాగితే తమకు ఈ పరిస్థితి వచ్చేదా? అని రైతులు మండిపడ్డారు.

కల్లాల్లోనే ధాన్యం..
యాసంగి పంట కోతలు దాదాపు పూర్తి కావొచ్చాయి. కానీ, కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. ఎక్కడా చూసినా ధాన్యపు రాశులే దర్శనమిస్తున్నాయి. వడ్లు ఆరబెట్టి కుప్పలు పోసి 20 రోజులు దాటుతున్నా కాంటాలు వేసింది లేదు. కల్లాలు దాటించిందీ లేదు. ఇక, దొడ్డు వడ్లు అంటే అసలు అటువైపు కన్నెత్తి చూడడమే లేదు. ఈ నేపథ్యంలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం జేశాయి. ధర్పల్లితో పాటు మైలారం, దుబ్బాక తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసి వడ్లు తడిసి పోయాయి. సిరికొండ మండలంలోనూ గాలివాన ఆగం జేసింది. ధాన్యం తడిసి పోవడంతో రైతులకు కంటతడి మిగిలింది. గాలుల కారణంగా కొన్ని గ్రామాల్లో చెట్లు విరిగిపోయాయి. ఇండ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.
వడ్లల్లోకి నీళ్లు.. రైతు కంట కన్నీళ్లు
కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్ ఏర్గట్ల మండలాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులకు తోడు వర్షం దంచికొట్టింది. గంటకు పైగా వాన కురియడంతో కల్లాల్లోకి నీళ్లు చేరాయి. వడ్ల కుప్పలను ముంచెత్తాయి. కాంటా వేసిన బస్తాలు మిల్లులకు తరలించక పోవడంతో అవి కూడా తడిసి పోయాయి. బలమైన గాలిదుమారం కారణంగా ధాన్యం రాశులపై కప్పిన పత్రాలు లేచిపోయి, వడ్లు తడిసి ముద్దయ్యాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో అటు ప్రభుత్వం నుంచి, ఇటు నుంచి ప్రకృతి నుంచి ఇక్కట్లు ఎదురవుతుండడంతో అన్నదాతలు ఆందోళనకు లోనవుతున్నారు. ‘కేసీఆర్ సారు ఉన్నప్పుడే బాగుండే.. వెంటవెంటనే కాంటాలు వేసి, ఖాతాల్లో పైసలు జమ చేస్తుండే. కానీ రేవంత్రెడ్డి అచ్చినంక పాత రోజులు దాపురమైనయ్. అడ్లు కొనేటోడు లేడు. కాంటా పెట్టేటోడు లేడు. రైతు కష్టాలల్ల ఉంటే పట్టించుకునేటోడు లేడని’ రైతులు వాపోతున్నారు.
