బడుగు, బలహీనవర్గాలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ సహా ఇతర హామీలను ప్రకటించిన హస్తం పార్టీ.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా బడుగులను దగా చేసింది. తాజాగా చేపట్టిన కుల గణన నివేదికను సైతం తప్పులతడకగా ప్రకటించడం, రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం మీదకు నెట్టేయడంపై బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.
బలహీనవర్గాలకు ఏదో చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేండ్ల క్రితమే రాష్ట్రంలో 50 శాతం బీసీల జనాభా ఉండగా, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికలో 46.25 శాతం ఉన్నట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తున్నది. రిజర్వేషన్లు, అవకాశాలు లేకుండా చేసేందుకు కుట్రపూరితంగా రేవంత్ సర్కారు బీసీల జనాభా తగ్గించి చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 8
కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కేందుకు అనేక వక్రమార్గాలను ఎంచుకున్నది. రైతులు, బలహీనవర్గాలను టార్గెట్‌గా చేసుకుని అలవి కానీ హామీలు ఇచ్చింది. 2023 నవంబర్ 10వ తేదీన కామారెడ్డి గడ్డపై నిర్వహించిన బహిరంగ సభలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్‌లో అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యులు ప్రకటించారు.
తీరా అధికారం చేపట్టి 15 నెలలు గడిచినా ఆ మాటను నిలబెట్టుకోలేదు. తాజాగా రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఓ తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ సర్కారు.. కేంద్రానికి పంపిస్తున్నామని, అక్కడ ఆమోదిస్తేనే రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడంపై బీసీలు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం మంత్రివర్గంలో, నామినేటెడ్ పదవుల్లోనైనా జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించక పోవడంపై నిలదీస్తున్నారు.
కామారెడ్డి గడ్డపై జరిగిన సభలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి 15 నెలలు గడిచినా వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదు. బీసీ సబ్‌ప్లాన్ తెచ్చి, ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున, ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. కానీ గత బడ్జెట్లో ఆ మేరకు నిధులే కేటాయించలేదు. బీసీ కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, వడ్డీ రహిత రుణాలు ఇస్తామని, జిల్లాకో బీసీ భవన్, డిగ్రీ కాలేజీ, మండలానికో బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పింది. చేతివృత్తులకు ప్రోత్సాహం కల్పిస్తామని, మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులకు షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి ఇస్తామని, 50 ఏండ్లు పైబడిన గీత కార్మికులు, చేనేతలకు పెన్షన్లు ఇస్తామని మోసం చేసింది.
దశాబ్దాలుగా వెనుకబడిన బీసీలను చిన్నచూపు చూడొద్దు. జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో బీసీలకు అవకాశం కల్పించాలి. ఇప్పటికే చాలా నష్టపోయాం. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పిస్తామంటే ఎంతో ఆశపడ్డాం. కానీ నిరాశే మిగిలేలా ఉన్నది. రాష్ట్ర జనాభా లో సగం కంటే ఎక్కువ మంది బీసీలే. కానీ సర్వేలో తగ్గినట్లు చూపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా తగ్గినట్లు చూపిస్తే బీసీలు మరింత నష్టపోతారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయాలి.
– మాడవేడి వినోద్‌కూమార్, బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు
వెనుకబడిన వర్గాలంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి చిన్నచూపే. దశాబ్దాలుగా ఏలిన హస్తం పార్టీ బీసీలకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి బీసీల ఓట్లు కావాలి కానీ, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి అక్కర్లేదు. బడుగులకు అండగా నిలబడింది ఒక్క కేసీఆరే. అనేక సంక్షేమ పథకాల అమలు, చేతివృత్తులకు చేయూతనిచ్చిన ఘనత బీఆర్ఎస్ది. ఎన్నికల ముందర ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అలవికానీ హామీలు ఇచ్చింది. డిక్లరేషన్లు ప్రకటించింది. ఏ ఒక్కటీ అమలు చేయకుండా మరోమారు మోసగించింది. అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు.
– సిర్ప రాజు, బీసీ సంఘం నాయకుడు
కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరోమారు అన్యాయం చేస్తున్నది. కుల గణన చేసి చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో చెబితే నమ్మినం. వాళ్లను నమ్మినందుకు మమ్మల్ని మోసం జేసిండ్రు. బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు. సర్వే జరిగిన తీరే అందుకు నిదర్శనం. కొన్ని ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లు అసలు ఇండ్లకే రాలేదు. అలాంటప్పుడు కుల గణన నివేదికు సరైన శాస్త్రీయత ఎక్కడ ఉంది. మళ్లీ సర్వే నిర్వహించి, బీసీలకు న్యాయం చేయాలి.
– ఎనుగందుల మురళి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల ముందర బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిండ్రు. గద్దెనెక్కాక డిక్లరేషన్ అమలును పక్కన పెట్టిండడ్రు. రేవంత్‌రెడ్డి బీసీల గొంత కోసిండు. రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ఆయన.. ఇప్పుడేమో కేంద్రం ఒప్పుకుంటేనే అని మెలిక పెట్టడం ద్వారా కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పేశారు. సర్వే వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి. గతంలో 50 శాతం ఉన్న బీసీల సంఖ్య ఈ పదేండ్లలో ఎలా తగ్గిపోతుంది? బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే బడుగుల జనాభా తక్కువ ఉన్నట్లు చెబుతున్నారు. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలి.
– మంజుల యాదవ్, అఖిల భారత యాదవ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలుదొంగ లెక్కలే..
పదేండ్ల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 50 శాతం ఉన్నట్లు తేలింది. ఈ పదేండ్లలో వారి సంఖ్య మరింత పెరగాలే. కానీ కుల గణన సర్వేలో బీసీల జనాభా తగ్గినట్లు చూపించడం అనుమానాలకు తావిస్తున్నది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికలో అన్ని దొంగ లెక్కలే చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలు రాజకీయంగా ఎదుగుతారనే భయంతోనే రేవంత్ ప్రభుత్వం కుట్ర పన్ని బీసీల సంఖ్య తక్కువ చేసి చూపిస్తున్నది. ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసగించింది. ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ల అమలు కోసం జనం తిరగబడడం ఖాయం.
– తెలంగాణ శంకర్, గాండ్ల సంఘం రాష్ట్ర నాయకుడు