ఖలీల్‌వాడి/ నిజామాబాద్ స్పోర్ట్స్, ఆగస్టు 29: యువతీయువకులు రిస్కు తీసుకొని జాబ్ సంపాందించాలని, తద్వారా జీవితంలో ఉన్నతస్థానంలో ఉంటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో టాస్క్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగాజాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. దేశంలోని ప్రముఖ 41 ప్రైవేట్, మల్టీ నేషనల్ కంపెనీలు నిజామాబాద్‌కు వచ్చాయని, 3,500 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారన్నారు. జాబ్‌మేళా నిరంతర ప్రక్రియ అని చెప్పారు. చిన్న చదువులు చదివినా యువతకు ఉద్యోగాలు వచ్చేలా కంపెనీలకు రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో నిర్వహించిన జాబ్‌మేళాలో కొన్ని కంపెనీలు ముందుకొచ్చి ముగ్గురు దివ్యాంగ అభ్యర్థులకు ఐటీ హబ్‌లో ఉద్యోగాలు కల్పించాయన్నారు.
ఐటీ హబ్‌లో మొత్తం 740 పోస్టులకు 331 పోస్టులను భర్తీ చేశామని, మిగతా ఉద్యోగాల కోసం నేటి జాబ్‌మేళాలో కూడా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్‌మేళాకు ఆన్లైన్ ద్వారా 8వేలమంది, ఆఫ్‌లైన్ ద్వారా 6వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారన్నారు. అందివచ్చిన ఉద్యోగాలను యువత సద్వినియోగం చేసుకొని జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఉద్యోగం సంపాదించాలంటే కష్టపడాలని, కష్టపడిన వారికి కచ్చితంగా జాబ్ వస్తుందని ఉద్బోధించారు. నిజామాబాద్ జిల్లా యువకులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు తరలివచ్చిన ప్రముఖ కంపెనీలకు, జాబ్‌మేళాను నిర్వహించిన టాస్క్ ప్రతినిధులకు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కొనసాగగా, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, నర్సింగ్ విభాగాల్లో విద్యార్హతలు కలిగి ఉన్న యువత జాబ్‌మేళాకు హాజరయ్యారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన కంపెనీల ప్రతినిధులు ఎంపికైన వారికి నియామకపత్రాలను అందజేశారు.
ముందడుగు వేయండి..
ఒకతను పర్వతాన్ని ఎక్కుతున్నాడు. బాగా చలి, మంచు మధ్య ధైర్యంగా ఎక్కుతున్నాడు. సడెన్‌గా గ్రూపు నుంచి సపరేట్ అయ్యి.. ఒక్కడే అయిపోతాడు. కొంతదూరం వరకు వెళ్లాడు.. రాత్రి చాలా చీకటి అవుతుంది. అక్కడే పర్వతంపైన ఉండిపోయాడు. భయమేస్తున్నది.. అంతలోనే జారి కిందపడతాడు. ఎక్కడ ఉన్నాడో తెల్వదు.. ఎంత ఎత్తులో ఉన్నాడో తెల్వదు.. జారి కిందపడ్డడు. తాడుతో వేలాడుతున్నాడు. దగ్గరలో ఏమీ కనిపిస్తలేదు. రక్షించమని దేవుడిని వేడుకున్నాడు. రెండు నిమిషాల తర్వాత ఒకరి మాటలు వినిపిస్తాయి. సాక్షాత్తు దేవుడే మాట్లాడుతూ నీ కష్టం నాకు అర్థమయ్యింది. రోప్(తాడు)ను కట్ చేసేయ్.. సేఫ్‌గా ఉంటావని చెప్తాడు. తాడు కట్ చేస్తే నేను కిందపడి చనిపోతానేమోనని భయంతో వ్యక్తి ఆలోచిస్తాడు. అనుమానంతో రోప్‌ను కట్ చేయడు. తెల్లార్లూ చలిలో అలాగే ఉండడంతో చివరికి చనిపోతాడు. రెండు, మూడు రోజుల తర్వాత డెడ్‌బాడీని తీసుకెళ్లడానికి కొందరు వెళ్లి అక్కడ చూడగా.. డెడ్‌బాడీ భూమికి అడుగు దూరంలోనే ఉన్నదట. చీకట్లో ఆ మనిషికి అర్థం కాలేదు. “ చాలా సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోం.. ఎవరైనా మనకు అవకాశం ఇచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే బెనిఫిట్ వస్తుంది. నమ్మకం లేక రిస్క్ తీసుకోలేని వాళ్లు జీవితంలో ప్రొగ్రెస్ లేకుండా అవుతారు. జాబ్‌మేళాలో వచ్చిన చిన్న జాబ్ అయినా చేయండి.. తద్వారా మరిన్ని అవకాశాలు వస్తాయి.”
ఉద్యోగాలను సద్వినియోగం చేసుకోవాలి
జాబ్‌మేళా నిరంతర ప్రక్రియ అని, ఎంపికైన యువత ఉద్యోగాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జాబ్‌మేళాలో ఎంపికైన వారికి నియామకపత్రాలను అందజేశామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అనేక మందికి జాబ్ చేస్తూ తదుపరి విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం దక్కిందని, అలాంటి కంపెనీలు కూడా జాబ్‌మేళాకు హాజరైనట్లు తెలిపారు. 20 నుంచి 30శాతం వరకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని, మిగిలిన 70శాతం మంది యువతీయువకులకు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. వచ్చిన ఉద్యోగాలను సద్వినియోగం చేసుకొని జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. యువత ఉద్యోగ, ఉపాధి కోసం కష్టపడాలని తెలిపారు.
అదృష్టంగా భావిస్తున్నాం..
జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. హైదరాబాద్‌కి వెళ్లకుండా ఇక్కడే జాబ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఒకే వేదికపై 41 కంపెనీలను తీసుకురావడం చాలా మంచి పరిణామం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్న నాయకులకు కృతజ్ఞతలు. ఇంటర్వ్యూలో విజయం సాధించి, ఎలాగైనా జాబ్ సాధిస్తా.
– ఆకాంక్ష, నిజామాబాద్
ఉద్యోగం రానివారు నిరుత్సాహపడొద్దు..
జాబ్‌మేళాలను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగం రానివారు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. ఐటీ హబ్‌లో ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించినప్పుడు చాలా మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చామని తెలిపారు. జాబ్‌మేళా నిరంతర ప్రక్రియ అని, ఇది ఆరంభం మాత్రమేనని ఆనాడే చెప్పినట్లు గుర్తు చేశారు. ఉద్యోగానికి ఎంపికైన యువతకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి, వివిధ మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బాజిరెడ్డి టీం సభ్యులు కొర్వ దేవేందర్, చింత మహేశ్, తిరుమల్, నవనీత్‌రెడ్డి,సంజయ్, రాకేశ్, టాస్క్ రిలేషన్షిప్ మేనేజర్ శ్రీనాథ్‌రెడ్డి, రీజినల్ సెంటర్ ఇన్చార్జి రఘుతేజ, యువతీయువకులు పాల్గొన్నారు.
సొంత జిల్లాలోనే ఉద్యోగాలు..
చాలా సంతోషంగా ఉన్నది. వేరే జిల్లాలకు వెళ్లకుండా సొంత జిల్లాలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గతంలో డిగ్రీ చదవగానే దుబాయ్ వెళ్లాలని చెప్పేవారు. కానీ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడంతో ఇక్కడే జాబ్ సంపాదించుకునే అవకాశం వచ్చింది.
– వరుణ్ తేజ్, మాక్లూర్
జాతరలా కనిపిస్తుంది..
జాబ్‌మేళా ఒక జాతరలా కనిపిస్తుంది. వేలాది మంది తరలివచ్చారు. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ చదివిన వారికి ఉన్న స్కిల్స్‌ను చూసి ఉద్యోగాలు ఇస్తున్నారు. సుమారు 41 కంపెనీలను నిజామాబాద్‌కు తీసుకొచ్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్న ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా ఇతర నేతలకు కృతజ్ఞతలు.
– బాంధవి, నిజామాబాద్
థాంక్యూ కవితక్క..
యువతకు ఉద్యోగాలను అందించేందుకు ఎమ్మెల్సీ కవితక్క చాలా కృషి చేస్తున్నది. మహానగరాల్లో ఉండే ఐటీ హబ్‌ను నిజామాబాద్ తెచ్చి, ఇలా ఉద్యోగాలు కల్పించడం మా అదృష్టం. నిరుద్యోగుల పాలిట కవితక్క వరంలా కనిపిస్తుంది. జాబ్‌మేళాకు చాలా మంది వచ్చారు. జాబ్ దొరికితే అదృష్టమే. మా కోసం ఇంత చేస్తున్న కవితక్కకు థ్యాంక్స్.
– ప్రవళిక, బోధన్
జాబ్ సాధిస్తా..
ఉద్యోగం వస్తే చాలు అదృష్టంగా భావిస్తా. ఎంత కష్టమైనా ఉద్యోగం సంపాదిస్తా. చాలా రోజుల తర్వాత జాబ్‌మేళా అంటే ఏంటో చూస్తున్నా. ఇంత మంది వస్తారనుకోలేదు. చాలా కంపెనీలు వచ్చాయి. ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి ఉద్యోగం సాధిస్తా.
– శ్రీలత, నిజామాబాద్