నిజామాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారంతా యుద్ధ బాధితులు. అనుకోని విపత్తుతో రోడ్డున పడిన అభాగ్యులు. అలాంటి వారిపై మమకారం చాటి వారి బతుకులకు ఆశలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మీ బతుకులతో మాకేం పని అన్నట్లుగా అమానవీయంగా ప్రవర్తిస్తోంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం లో భాగంగా తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు మోదీ సర్కారు తీరు శాపంగా మారింది. యుద్ధం నుంచి ప్రాణాలు చేత పట్టుకుని వచ్చిన వారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరాశకు గురి చేస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 60-70 మంది వరకు వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌లోని ఆయా రాష్ర్టాల నుంచి వచ్చిన వారున్నారు. మెడిసిన్‌లో ఆయా తరగతుల్లో విద్యను అభ్యసిస్తున్న వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వైద్య విద్యకు స్వదేశంలో అవకాశం కల్పించాలని ఉక్రెయిన్ వైద్య విద్యార్థులు కోరుతున్నప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటున్నది. మొద్దు నిద్ర పోతున్న బీజేపీ ప్రభుత్వ తీరుతో అమాయకులు ఆందోళనకు గురవుతున్నారు. మోదీ ఇది నీకు తగునా అంటూ ఉక్రెయిన్ యుద్ధ బాధితులు ప్రధాన మంత్రిని ప్రశ్నిస్తున్నారు.
బతుకులను ఆగం చేస్తున్న మోదీ..
దేశ ప్రజలను తన పరిపాలనలో పీల్చి పిప్పి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా యుద్ధ బాధితులకు సైతం మొండి చేయి చూపిస్తున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థుల జీవితాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడం లేదు. తిరిగొచ్చిన వీరందరికీ భారతదేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించాలని పార్లమెంట్లో పలువురు ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదీ సాధ్యం కాదంటూ కేంద్ర సర్కారు ప్రకటించడం ఆయా వర్గాల్లో కుంగుబాటుకు గురి చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా విసిరిన బాంబు దాడుల కన్నా ప్రమాదకరంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవర్తిస్తోందంటూ వైద్య విద్యార్థులు మండిపడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి తమ పిల్లలపై ఖర్చు చేసిన డబ్బులు వృథా కావడంతో పాటు విలువైన సమయం కూడా చేతికందకుండా పోయిందంటూ బాధితుల తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లిష్టమైన సమయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది చేసేది లేక ఇతర దేశాలకు వెళ్లాల్సి వచ్చి ఆర్థికంగా అప్పుల పాలవుతున్నారు.
కనికరించని కేంద్రం..
నిత్యం పేదలపై భారం మోపడం… కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేస్తూ వారి ఆస్తులను పెంపొందించడమే పనిగా పెట్టుకున్నట్లు వ్యవహరించే నరేంద్ర మోదీ ప్రభుత్వం తన నిజ స్వరూపాన్ని మరోసారి చాటుకున్నది. స్వదేశంలో నీట్ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు వచ్చినప్పటికీ కోరుకున్న కాలేజీల్లో సీటు రాక, నీట్ ద్వారా మెడికల్ సీటు పొందలేక పోయిన వారెందరో విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్తుంటారు. ఉక్రెయిన్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలస వెళ్లి చదువుకోవడం కొత్తేమీ కాదు. వీరికి వీసాలు మం జూరులో కేంద్రం ఆధీనంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖనే అనుమతులు సైతం మంజూరు చేస్తున్నది. ఉక్రెయిన్ – రష్యా దేశా ల మధ్య తలెత్తిన వివాదం యుద్ధానికి దారి తీయడంతో బాధి త దేశంలోని విదేశీయులకు ప్రాణహాని ఉండడంతో వారంతా స్వదేశాలకు వచ్చేశారు. బతుకు జీవుడా అనుకుంటూ వచ్చిన వారంతా ఎంబీబీఎస్‌లో రాటుదేలి దేశ ప్రజలకు సేవ చేయాలని సంకల్పించిన వారే. వీరి వైద్య విద్యకు ఇప్పుడు ఆటంకం ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించాల్సి ఉండగా కనీసం పట్టించుకోవడం లేదు. దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సీట్లను తాత్కాలికంగా పెంచడమో లేదంటే ఉక్రెయిన్ బాధితుల కోసం ప్రత్యేకంగా కోటాను ఏర్పాటు చేసి సర్దుబాటు చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు.
మానవతను చాటుకున్న కేసీఆర్…
మన దేశానికి చెందిన 20వేల మంది వైద్య విద్యార్థులు యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. మన రాష్ట్రం నుంచి 740 మంది ఉన్నారు. ఇందులో 700 మంది పిల్లలు ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లారు. తెలంగాణకు చెందిన వారందరినీ రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు వెచ్చించి వారిని ప్రాణాలతో స్వరాష్ర్టానికి తీసుకు వచ్చింది. ఇంటికి చేరిన ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేశారు. ఉక్రెయిన్ వీడి వచ్చిన రోజునే వారందరికీ అభయం కల్పించారు. యుద్ధ బాధితులకు ఆసరా అయ్యేందుకు వారికయ్యే వైద్య విద్య ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు. కేంద్ర సర్కారు మాత్రం దేశీయ వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య పరిస్థితులు ఇంకా విషమిస్తున్న సమయంలో అక్కడి చదువులపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆన్లైన్ తరగతులు సైతం జరగడం లేదు. స్వదేశంలో వైద్య విద్యకు మోదీ సర్కారు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వారంతా దిక్కుతోచక ఇబ్బంది పడుతున్నారు.
మానవత్వం లేని నరేంద్ర మోదీ…
విదేశీ విద్యా విధానం అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అంశం. దురదృష్టవశాత్తు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం మూలంగా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారంతా ఇంటికి వచ్చేశారు. వీరి చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచినప్పటికీ విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విఫలం చెందుతున్నారు. ఎంతో మంది అభాగ్యుల జీవితాలతో బీజేపీ సర్కారు ఆటలాడుకోవడం మంచిది కాదు.
– నరాల సుధాకర్, విద్యావేత్త
బాధ్యత మరిచిన కేంద్ర ప్రభుత్వం…
బతుకు జీవుడా అనుకుంటూ స్వదేశానికి వచ్చిన ఉక్రెయిన్ బాధితులకు కనీస ధర్మంగా మోదీ ప్రభుత్వం అండగా నిలవడం లేదు. యుద్ధం ఆరంభమైన నాటి నుంచి వారి బతుకుల్లో చీకట్లు అలుముకున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం చేతులు ఎత్తేసి తమాషా చూస్తోంది. ఎంబీబీఎస్ పూర్తి చేద్దామనుకున్న అనేక మందికి మోదీ సర్కారు శాపంగా దాపురించింది. ప్రజలు తగు రీతిలో బుద్ది చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
– పుప్పాల రవి, టీఆర్ఎస్వీ నాయకుడు