మోర్తాడ్/నిజాంసాగర్, సెప్టెంబర్ 9 : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి గురువారం సాయంత్రానికి 26 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, అంతే మొత్తంలో అవుట్‌ఫ్లో రూపంలో వెళ్తున్నది. వరద కాలువకు 18 వేలు, కాకతీయ కాలువకు 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టంతో 1090.90 అడుగులు (80.053 టీఎంసీలు) నిండుకుండలా కనిపిస్తున్నది.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు సైతం వరద తగ్గడంతో సోమవారం గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రానికి 17,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1404.76 అడుగుల (17.455 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ఏఈ శివప్రసాద్ తెలిపారు. గత ఐదు రోజుల్లో సుమారు 10 టీఎంసీల మిగులు జలాలను దిగువకు విడుదల చేశామన్నారు.