Pocharam | పెద్దకొడప్గల్, జూలై 6 : కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని పోచారం గ్రామంలో నూతన రేషన్ బియ్యం దుకాణాన్ని సోమవారం తహసీల్దార్ రాజశేఖర్ (MRO), ఎంపీడీవో అభినవ్ చందర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి సకాలంలో పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని డీలర్‌కు సూచించారు.
రేషన్ పంపిణీలో ఏవైనా సమస్యలు ప్రజలకు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామంలో రేషన్ దుకాణం ప్రారంభం కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలాజీ పటేల్, ఎంపీవో లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు శామప్ప పటేల్, గ్రామస్తులు పాల్గొన్నారు.