మామిళ్లగూడెం, ఆగస్టు 17 : ఎస్సీ వర్గీకరణకు రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మాలల మహా గర్జన పేరుతో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు గుంతేటి వీరభద్రం, పల్లా రాజశేఖర్, లింగాల రవికుమార్‌లు మాట్లాడుతూ రోస్టర్ పాయింట్ల విధానం వల్ల మాలలు పూర్తిస్థాయిలో నష్ట పోయే ప్రమాదం ఉందన్నారు.
విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాలలో ఎస్సీల స్థితిగతులను సమగ్రంగా సర్వే చేసి తాజా జనాభా లెక్కల ప్రకారంగా వర్గీకరణ చేపట్టకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించి ఎస్సీలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ దివాకర టీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దామల్ల సత్యనారాయణ, బిందె రమేశ్, తొగరు భాస్కర్, మెట్టు వెంకటేశ్వర్లు, నారమళ్ల వెంకటన్న, పల్లి మల్లికార్జున్, కొప్పుల రాములు, కొరివి దయానంద్, కరాటే వేణు, చింతపల్లి వెంకన్న, దారా ఏసురత్నం, జమ్మి వీరబాబు, దాసరి శ్రీను, తలారి నాగభూషణం పాల్గొన్నారు.