నిజామాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) చివరి దశకు చేరుకుంది. జూన్ 25న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో కీలక ఘట్టానికి భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికి తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్లకు సమర్పించారు. సమాచారాన్ని భర్తీ చేసిన అనంతరం ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించి డిజిటలైజేషన్ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియకు గడువును రెండు సార్లు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు 10నాటికి ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించే ప్రక్రియ ముగియడంతో సర్‌లో నిమగ్నమైన యంత్రాంగం తదుపరి పనులను పూర్తి చేశారు. డిజిటలైజేషన్‌తో పాటుగా ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని వాళ్లను గుర్తించారు. ఓటరు మ్యాపింగ్ ఆధారంగా చనిపోయిన, వలస వెళ్లిన, పూర్తిగా అందుబాటులో లేని ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా గుర్తించారు. జూన్ 10 నాటికి విడుదలైన తుది ఓటరు జాబితా నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు అందివ్వని ఓటర్లను తీసి వేశారు. వచ్చిన గణాంకాలను ముసాయిదా ఓటరు జాబితా రూపంలో ఎన్నికల సంఘం విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 11వేల 670 ఓట్లు, కామారెడ్డి జిల్లాలో 84వేల 268 ఓట్లు తొలగింపునకు గురవుతున్నాయి.
సర్ ప్రక్రియను అక్టోబర్ 19తో ముగిసి పోనుంది. అదే రోజున తుది ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం వెల్లడించబోతోంది. ప్రస్తుతం ముసాయిదా జాబితా వెల్లడైన నేపథ్యంలో ఇందులో తప్పులు, ఒప్పులను సవరించుకునేందుకు ఓటర్లకు అవకాశం కల్పించింది. పేర్లలో తప్పులు, చిరునామా మార్పు వంటి వాటిని మార్చుకునేందుకు అవకాశం ఉన్నది. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 15 వరకు ఓటర్ల నుంచి వచ్చిన వినతులను పరిశీలన చేస్తారు. అనంతరం అక్టోబర్ 19న తుది ఓట్లతో జాబితా వెల్లడిస్తారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మ్యాపింగ్ చేయని ఓట్లు 60వేలు ఓట్లు ఉన్నాయి. 2002 ఓటరు సవరణ జాబితాతో మ్యాపింగ్‌కు నోచుకోని ప్రస్తుతం ఓటర్లను ఈ జాబితాలో కలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విదేశాలు వలస వెళ్లి వచ్చిన వారంతా ఇందులో చేర్చబడ్డారు. ఈ ఓటర్లను ప్రత్యేక్షంగా బీఎల్వోలు పరిశీలన చేస్తారు. వారి వద్ద ఉన్నటువంటి గుర్తింపు కార్డులను స్వీకరించి పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతాధికారుల అనుమతితో తుది జాబితాలో ఓటరుగా చోటు కల్పిస్తారు. విదేశీ మహిళలను వివాహం చేసుకుని ఓటు హక్కు పొందితే వాళ్లకు భారతీయ పౌరసత్వం ఉండాలి. లేకపోతే వీరి ఓటును తొలగిస్తారు. నిజామాబాద్‌లో 41వేల 71 ఓట్లు, కామారెడ్డిలో 19వేల 176 ఓట్లు మ్యాపింగ్ చేయనివి ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం వరకు అందుబాటులో ఉన్న తుది ఓటరు జాబితా ప్రకారం 14లక్షల 39వేల 734 ఓట్లుండగా సర్ ప్రక్రియ ద్వారా 12లక్షల 28వేల 64 ఓట్లకు చేరింది. అత్యధికంగా 2లక్షల 11వేల 670 గల్లంతు కాబోతున్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో మొత్తం ఓట్లలో 27.02శాతం అంటే 83,282 ఓట్లను తొలగించనున్నారు. కామారెడ్డి జిల్లాలో 6లక్షల 96వేల 6 మంది ఓట్లు ఉండగా ప్రస్తుతం సర్ కార్యక్రమంలో విడుదల చేసిన ముసాయిదా అనుసరించి 6లక్షల 11వేల 738 ఓటర్లు ఉన్నారు. 84వేల 268 ఓట్లు అధికారికంగా జాబితా నుంచి తీసి వేయనున్నారు. ఈ జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలోనే అత్యధికంగా 15.99శాతం అంటే 41వేల 767 ఓట్లను తీసి వేయబోతున్నారు. తొలగించిన ఓట్లలో ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారు, చనిపోయిన వారు, చిరునామాల్లో లేని వాళ్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వాళ్లున్నారు.