చౌటుప్పల్, సెప్టెంబర్ 25 : చౌటుప్పల్ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఫౌండేషన్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ బొల్ల శివశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాబ్ మేళా జరగనుంది. 50కి పైగా కంపెనీలు పాల్గొని మ్యానుఫ్యాక్చరింగ్, బీపీఓ, ఐటీ, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, రిటైల్, సేల్స్, మార్కెటింగ్ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలోతెలిపారు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలను వారి వద్దకే తీసుకురావాలన్న లక్ష్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు బొల్ల శివశంకర్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక యువకుడికి ఉద్యోగం వస్తే ఒక కుటుంబానికి భరోసా కుటుంబం ఆర్థికంగా నిలబడితే సమాజం బలపడుతుంది అనే లక్ష్యంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.