బాన్సువాడ, మార్చి 24: రేవంత్‌రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం.. 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి తెలంగాణకు సాధించుకొచ్చింది ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా పాలన నడుస్తున్నదా.. లేక ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నదా? అని కవిత ప్రశ్నించారు. ఈ సీఎం ఏం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాన్సువాడలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పదేండ్లలో కేసీఆర్ సర్కారు మైనార్టీల సంక్షేమానికి అండగా నిలిస్తే, 15 నెలల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇచ్చే తోఫాలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమం కోసం పెట్టిన బడ్జెట్లో కనీసం 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదన్నారు.
కేసీఆర్ అధికారంలో ఉన్న పదేండ్లలో ఒక్క మత ఘర్షణ జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకో మత ఘర్షణ చోటు చేసుకున్నదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం ఏ ఒక్కరోజైనా సమీక్షించిన పాపాన పోలేదన్నారు. జైనూరులో మూడు నెలలు ఇంటర్నెట్ బంద్ పెట్టారని, అక్కడ హిందూ, ముస్లింల ఇండ్లను దహనం చేసినా రేవంత్‌రెడ్డికి పట్టించుకునే తీరిక లేదని విమర్శించారు. బాధితులకు కనీసం పరిహారం ఇవ్వలేదని, బాధ్యులపై చర్యలు కూడా తీసుకోలేదన్నారు.
కేసీఆర్ సర్కారు పుష్కలంగా సాగునీరు ఇవ్వడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపించేదని కవిత గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న పొలాలు చూసి రైతులు గోస పడుతుంటే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాను హైదరాబాద్ నుంచి బాన్సువాడ నియోజకవర్గానికి వస్తుంటే దారి పొడువునా రైతులు ఆపి తమ కష్టాలను చెప్పారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీటి కష్టాలు వచ్చాయని, కేసీఆర్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండే అని రైతులు తెలిపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని నీరుగార్చిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ఇస్తామన్న రైతుబంధు ఇవ్వలేదు.. బోనస్ కొంత మందికే ఇచ్చిచేతులు దులుపుకొన్నదని విమర్శించారు. రైతులు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారన్నారు.
‘పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వానికి సలహాదారుడు అయ్యిండు. ఆయన ఏం సలహాలు ఇస్తున్నారో రం జాన్ పండుగ సందర్భంగా మీ ఇంటి కో, మీ కాలనీకో వస్తే ప్రశ్నించండి. మైనార్టీ గురుకులాలు కేసీఆర్ హయాంలో ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నా యో పోచారంను అడుగండి’ అని కవిత అక్కడున్న వారికి సూచించారు. బాన్సువాడకు సాగునీళ్లు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే పోచారం మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయలేదని కవిత విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రూ.1800 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోతే కేసీఆర్ సీఎం అయ్యాక ఆ బకాయిలు క్లీయర్ చేసి, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చూశారని గుర్తు చేశారు. పోచారం ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇప్పించాలని సూచించారు. ‘కేసీఆర్ షాదీముబారక్ కింద లక్ష మాత్రమే ఇస్తుండు.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ.1.60 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరీ 15 నెలలల్ల ఏ ఒక్కరికైనా 1.60లక్షలతో పాటు తులం బంగారం ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. 15 నెలల్లో 1.50 లక్షల కోట్ల అప్పులు చేసినా తులం బంగారం ఇవ్వలేదన్నారు. వీటన్నింటిపై సీఎంను ఒప్పించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాన్సువాడలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన పోచా రం సొంత లాభం కోస మే పార్టీ మారిండని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కాంగ్రెస్‌లోకి పోయిన తర్వాత బాన్సువాడకు చేసిందేమన్నా ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే బాన్సువాడ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ ఏజెంట్.. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండొద్దని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవ చేయని రేవంత్‌రెడ్డికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. బాన్సువాడలో ఎమ్మెల్యే పార్టీ మారినా బీఆర్ఎస్కు ఆదరణ తగ్గలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ బీఆర్ఎస్ను ముందుకు నడిపిస్తున్నారన్నారు.