నిజామాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలపై అంతగా దృష్టి సారించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగాలు సాధించిన వారికి నియామకపత్రాలను అందజేసింది. డీఎస్సీ తప్ప కొత్తగా ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగ యువతను మచ్చిక చేసుకునేందకు రాజీవ్ యువ వికాసంపేరుతో ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధి అవకాశాలు, సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేందుకు దరఖాస్తులు కోరగా ఉమ్మడి జిల్లాలో లక్షా 3వేల 558 మంది ఉత్సాహం చూపారు.
జనాభా ప్రాతిపదికన 35వేల 732 యూనిట్లు లక్ష్యంగా కేటాయించారు. ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు గరిష్ఠంగా ముగ్గురు నుంచి ఐదుగురి వరకు ఆయా మండలాల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పోటీ ఏర్పడింది. జిల్లాలకు కేటాయించిన యూనిట్లను జనాభాను ఆధారంగా చేసుకుని ఆయా మండలాలకు కేటాయించారు. రాయితీతో కూడిన రుణాలు ఇస్తామని చెప్పడంతో యువత పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకోగా సిబిల్ పేరుతో సర్కారు కొత్త నిబంధన తెర మీదికి తీసుకు రావడంతో ఆశావహుల్లో గుబులు మొదలైంది. సిబిల్ స్కోర్‌ను బూచీగా చూపితే చాలా మంది అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం, రుణాలు ఇప్పించడం, రాయితీల కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కన్వీనర్‌గా, ఆయా శాఖల అధికారులు, బ్యాంక్ అధికారులు సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో కన్వీనర్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖ అధికారులు, సభ్యులుగా మండల పరిధిలోని బ్యాంక్ అధికారులు ఉంటారు.
మున్సిపల్ పరిధిలో కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకంలో మొదటగా వితంతువులు, ఒంటరి మహిళలు, నిరుద్యోగులు, దివ్యాంగులు, నిరుద్యోగులకు యూనిట్ల మంజూరుకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక, మంజూరు ప్రక్రియలను ఈ నెలాఖరులోనే పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. రాష్ర్టావతరణ దినోత్సవం నాటికి మంజూరు పత్రాలు అందించనున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 22,285 యూనిట్లు కేటాయించారు. దరఖాస్తులు 58వేల 896 వచ్చాయి. ఇందులో ఎస్సీలకు 5,817, ఎస్టీలకు 3,088, బీసీలకు 7,969, మైనార్టీ 2,911, క్రిస్టియన్ 174, ఇతరులకు 2,326 యూనిట్లు కేటాయించారు. కామారెడ్డి జిల్లాలో 13వేల 447 యూనిట్లు రాగా దరఖాస్తులు 44వేల 662 వచ్చాయి. ఎస్సీలకు 4,104, ఎస్టీలకు 2,356, బీసీలకు 4,698, మైనార్టీ 973, ఇతరులకు 1,272 యూనిట్లు కేటాయించారు. వచ్చిన దరఖాస్తులను మండలంలో ఉన్న జనాభా, యూనిట్లు, ఆ మండల పరిధిలో ఉన్న బ్యాంక్ శాఖలకు అనుగుణంగా బ్యాంక్‌లకు కేటాయిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి రాజీవ్ యువ వికాసం అర్హులను ఎంపిక పూర్తిచేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే వేగంగా దరఖాస్తులను స్వీకరించగా.. యువత నుంచి భారీ స్పందన వచ్చింది. దరఖాస్తులు లక్షకుపైగా రాగా యూనిట్లు మాత్రం వేలల్లోనే మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరికి యూనిట్లు మంజూరు అవుతాయో? ఎవరికి మొండిచేయి దక్కుతుందో? తెలియడం లేదు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని దరఖాస్తుదారులు కోరుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక మాదిరిగానే రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనిట్ల కేటాయింపులో పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులకు అందించాలని డిమాండ్ వినిపిస్తోంది. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటున్నది. జూన్ 2 నాటికి కొద్ది మందికి మంజూరు పత్రాలు అందించి ఆ తర్వాత మంజూరైన యూనిట్లకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని యంత్రాంగం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.