లింగంపేట, జూలై 1: రాజంపేట మండలం శివాయిపల్లిలో సాకలి సుజాత (30), సాకలి గంగారాం (35) దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు రాజంపేట ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలం కోర్పోల్ గ్రామానికి చెందిన సాకలి గంగారాం దంపతులు నెలరోజుల క్రితం రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చారు.
వీరికి కుమారుడు రాంచరణ్, ఇద్దరు కూతుళ్లు రేవతి, రితిక ఉన్నారు. గంగారాం దంపతులు గ్రామానికి చెందిన ప్రభాకర్‌రావు వద్ద వ్యవసాయ పనులు చేయడానికి జీతం మాట్లాడుకున్నారు. మూడు రోజుల క్రితం ఓ విషయంలో భార్యా భర్తలు గొడవ పడి ఇద్దరు పురుగుల మందు తాగారు. స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వీరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి సుజాత మృతి చెందింది. మంగళవారం ఉదయం గంగారాం చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. మృతుల బంధువు తలమడ్ల భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు పేర్కొన్నారు.