నిజామాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానాకాలం సీజన్ మొదలై దాదాపుగా రెండున్నర నెలలు గడుస్తోంది. భారీగా కురిసిన వానలంటూ ఏమీ లేవు. వరద పోటెత్తడం లేదు. భారీ వర్షాలు కురియడం లేదు. కొద్ది రోజులైతే ఆగస్టు మాసం కూడా ముగియనుంది. సీజన్ చివరి అంకానికి చేరుకున్నప్పటికీ చినుకు లేక చెరువుల్లోకి నీరు చేరక అనేక చోట్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేలాది చెరువులు ఉండగా సగానికి ఎక్కువ నీళ్లు లేక కనిపిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల వివరాల మేరకు కేవలం 20 శాతం తటాకాలు మాత్రమే మత్తడి వరకు చేరుకున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 85 చెరువులే ఇప్పటి వరకు మత్తడి దుంకాయి. మిగిలిన చెరువుల్లోకి వచ్చిన నీళ్లు వచ్చినట్లే పారకానికి వదులుతుండటంతో ఆయకట్టు రైతుల్లో కాసింత ధైర్యం కనిపిస్తోంది. కాకపోతే వచ్చే యాసంగి సీజన్‌కు భరోసా నిండాలంటే భారీ వానలు అవసరం. చెడగొట్టు వానలతోనే ఏటా చెరువుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇదే ట్రెండ్ ఈసారి కూడా కొనసాగుతుందేమోనన్న భయం అందరిలోనూ కనిపిస్తోంది. ముసురు ముసుగేసి రోజుల తరబడి కొనసాగుతున్నప్పటికీ గట్టిగా వానలు కురుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఫర్వాలేదు అన్నట్లుగా వర్షాలు పడుతున్నాయి. ఎండిపోతున్న పంటలకు జీవం పోస్తున్నాయి.
రైతుల్లో భయాందోళనలు..
వానాకాలంలో ఎదురవుతోన్న వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కాలంతో పని లేకుండా సాగుకు ఠంచనుగా నీళ్లు అందేవి. ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం వరుణ దేవుడి మీదనే ఆధారపడింది. రైతులకు కనీసం భరోసా కల్పించడం లేదు. వానాకాలం సీజన్‌కు ముందే చెరువులను నింపి కాలంతో సంబంధం లేకుండా రైతులకు కొండంత ధైర్యం గతంలో లభించేది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిందారోపణలు చేస్తూ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనేక పంప్‌హౌస్‌లను గాలికి వదిలేసి రైతులతో కాంగ్రెస్ సర్కారు ఆటాలాడుతోంది. రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతుండటంతో చేసేది లేక ఎస్సారెస్పీ నుంచి దిగువకు నీళ్లను వదిలారు. పోచాంపాడ్లో ప్రస్తుతం 42.117 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఆదివారం నాటికి వరద కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 3500 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ ద్వారా 800 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోథల పథకం ద్వారా 360 క్యూసెక్కులు, గుత్పా లిఫ్ట్ ద్వారా 270 క్యూసెక్కులను సాగుకు మళ్లిస్తున్నారు.
కానరాని నీటి నిల్వ..
నిజామాబాద్ జిల్లా ఇరిగేషన్ శాఖ సీఈ(చీఫ్ ఇంజనీర్) పరిధిలో మొత్తం 996 చెరువులు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 0-25శాతం నీటి నిల్వతో 371 చెరువులు ఉన్నాయి. 25-50శాతం నీటి నిల్వతో 401 చెరువులు ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 50-75శాతం మేర నీటి నిల్వతో కేవలం 178 చెరువులే నెలకొన్నాయి. 75-100శాతం నీళ్లతో 37 చెరువులు మాత్రమే కళకళలాడుతున్నాయి.
ఈ వానాకాలం సీజన్లో అలుపు పారిన చెరువులు కేవలం 9 మాత్రమే ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. అనేక చెరువుల్లోకి వాన నీటి రాక ఉధృతంగా కొనసాగడం లేదు. బోధన్ డివిజన్ పరిధిలో 182 చెరువులు ఉన్నాయి. ఇందులో 16 చెరువులే పూర్తి స్థాయి నీళ్లకు చేరింది.
నిజామాబాద్ డివిజన్ పరిధిలో 324 చెరువులుండగా కేవలం 8 చెరువులు మాత్రమే భారీ నీటి నిల్వ స్థాయికి చేరాయి. ఆర్మూర్ డివిజన్లో 198 చెరువులు ఉండగా 13 చెరువుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది. బాల్కొండ డివిజన్లో 292 చెరువులుంటే ఇప్పటి వరకు ఒక్క చెరువు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోలేదు. నిజామాబాద్ జిల్లాలో 4లక్షల 40వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి.
పోటెత్తని వరద..
కామారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ సీఈ(చీఫ్ ఇంజనీర్) పరిధిలో మొత్తం 1515 చెరువులు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 0-25శాతం మేర వరద నీరు వచ్చి చేరిన చెరువుల సంఖ్య 507 ఉన్నాయి. 25-50శాతం నీటితో 507 చెరువులు, 50-75శాతం నీళ్లతో 213 చెరువులున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 75-100 శాతం నీటి నిల్వతో 162 చెరువులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు 76 చెరువులే అలుగు పారినట్లుగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
బాన్సువాడ డివిజన్లో 185 చెరువులకు 71 చెరువులు మాత్రమే పూర్తి స్థాయిలో నిండాయి. నిజాంసాగర్ డివిజన్లో 400 చెరువులకు 13 మాత్రమే పూర్తి స్థాయిలో నీళ్లు చేరాయి. కామారెడ్డి డివిజన్లో 370 చెరువులుంటే 32, ఎల్లారెడ్డి డివిజన్లో అత్యధికంగా 560 చెరువులు ఉండగా కేవలం 67 చెరువుల్లోకి మాత్రమే పూర్తి స్థాయిలో నీరు వచ్చింది.
కామారెడ్డి జిల్లా ఇప్పటి వరకు లోటు వర్షాపాతంలో రాష్ట్రంలోనే ముందుంది. వానల్లేక, చెరువుల్లోకి వరద నీరు చేరకపోవడంతో రైతుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మేఘావృతం అవుతోన్న పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ చినుకు రాలి రైతుల ఆశలను నిలబెట్టడం లేదు. వానాకాలం కావడంతో కామారెడ్డిలో అత్యధిక శాతం మంది 3లక్షల 20వేల ఎకరాల్లో వరి పంటనే సాగు చేశారు.