ఖలీల్‌వాడి, మార్చి 27 : రాష్ట్ర ప్రభుత్వ చేతగాని తనంతోపాటు విద్యాశాఖ నిర్లక్ష్యంతోనే పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకైనట్లు బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు ఆరోపించారు. జుక్కల్‌లో పదోతరగతి పరీక్ష ప్రశ్నల లీక్ నేపథ్యంలో గురువారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్వీ జిల్లా యువజన నాయకుడు అభిలాష్ మాట్లాడుతూ.. నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్, జుక్కల్‌లో పేపర్ లీకైందని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ నాలుగు పరీక్షలు నిర్వహిస్తే, నాలుగు ప్రశ్నాపత్రాలు లీకవడం చూస్తుంటే విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో అర్థమవుతున్నదని మండిపడ్డారు. కార్పొరేట్ స్కూళ్లతో కుమ్మక్కై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లీకులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కోరితే, సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో కేటీఆర్‌పై నకిరేకల్‌లో అక్రమ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని, తాము న్యాయపరంగా కొట్లాడుతామన్నారు. సమావేశంలో చిన్నారం (రమేశ్), ప్రశాంత్, మధు, గంగాధర్, నితిన్, యూనుస్, రాజు, అజయ్ పాల్గొన్నారు.