Peddakodapgal | పెద్ద కొడప్ గల్ జూలై 14 : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పెద్దకొడప్గల్ మండల ప్రత్యేకాధికారి బలరాం అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆయన స్థానిక ఎంపీడీవో అభివన్ చందర్ కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, పరిశుభ్రత, స్టాక్ రూమ్, వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించి, వారి చదువు, అవగాహన స్థాయిపై ప్రిన్సిపాల్ సునీతను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన ప్రత్యేక అధికారి పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలు, వసతి, భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో పరిశుభ్రత, క్రమశిక్షణను అభినందిస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సునీత, పంచాయతీ కార్యదర్శి శివాజీ,ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.