వినాయక్‌నగర్, జనవరి 8 : పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు కొత్త కార్యాచరణ ప్రారంభించారు. బాధితులు సమస్యలు విన్నవించేందుకు పోలీస్స్టేషన్లకు వెళ్లిన అనంతరం పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరు, సిబ్బందిపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్‌కోడ్ పద్ధతిని నేటి (గురువారం) నుంచి ప్రవేశపెట్టనున్నట్లు ఇన్చార్జి సీపీ సింధూశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విధానంతో ఫిర్యాదుదారులు, ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేడు ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ పోస్టర్లను జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని, ప్రజలు పోలీసుల పనితీరుపై ఫీడ్‌బ్యాక్ అందించాలని సూచించారు.